తెలంగాణ పునర్నిర్మాణంలో వ్యవసాయమే కీలకం : కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వ్యవసాయమే కీలకమని, ఆ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రధాన భూమిక పోషించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ‘తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం-వ్యవసాయ విశ్వవిద్యాలయం పాత్ర’ అనే అంశంపై శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించే ముందు 1956 కంటే ముందుగల ఆస్తులు, వనరులను తెలంగాణకు ప్రకటించాలని, ఉమ్మడిగా అయిన ఖర్చును జనాభా ప్రాతిపదికన పంచాలని అన్నారు.
తెలంగాణలో నీరులేక వ్యవసాయం వెనకబడిపోయిందని, నదీజలాల పంపిణీలో ట్రిబ్యునల్ సూచించిన మేరకు వాటాను పంచాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించడంలో రైతాంగానికి ఏజీ వర్సిటీ మార్గదర్శకంగా ఉండాలని కోరారు. సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరిశోధన, శాస్త్ర పరిజ్ఞానం అందినప్పుడే తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలోని వ్యవసాయ సంక్షోభాన్ని రూపుమాపడానికి, విప్లవాత్మక మార్పులు తేవడానికి ఏజీ వర్సిటీ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎంపీ వివేక్, టీఎన్‌జీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ కూడా మాట్లాడారు.