అనారోగ్యంతోనే జయ మృతి
► నివేదిక సమర్పించిన ఎయిమ్స్
► తమిళనాడు ప్రభుత్వం వెల్లడి
సాక్షిప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత అనారోగ్య కారణాలతోనే చనిపోయారని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధా రమైనవంది. జయకు జరిగిన చికిత్స వివరాలను బహిరంగంగా వెల్లడించ కూడదనే నిబంధన ఉన్నా అనవసర వదంతులకు తావివ్వకూడదనే కారణంతో ప్రకటన విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ మీడియాకు చెప్పారు.
జయ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ నెల 8న నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జయకు చికిత్సలో భాగస్వామ్యులైన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు తమిళనాడు ప్రభుత్వానికి సోమవారం నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ‘గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి జయలలిత శ్వాసకోశ ఇబ్బందితో స్పృహ కోల్పోయిన స్థితిలో అపోలో ఆస్పత్రిలో చేరారు.
వైద్య పరీక్షలు నిర్వహించినపుడు డీహైడ్రేషన్, జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నట్లు తేలింది. ఆమెను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని ప్రారంభిం చాం. డిసెంబరు 3న జయను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులను అభినందించారు. అయితే 4న ఆమె తీవ్ర గుండెపోటుకు గురికాగా ఎక్మో చికిత్స అందజేశాం. అయినా దుర దృష్టవశాత్తూ 5వ తేదీ రాత్రి 11.30 గంట లకు జయ తుదిశ్వాస విడిచారు’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది.