అసదుద్దీన్ ఒవైసీకి ఎదురుదెబ్బ!
- మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీపై నిషేధం
ముంబై: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. నిర్ణీత గడువులోగా పార్టీ ఆదాయ వ్యయాల ఆడిట్ నివేదిక తమకు సమర్పించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈసీ గతంలోనే ఆడిట్ నివేదిక సమర్పించాలని ఎంఐఎంను ఆదేశించింది. ఆడిట్ నివేదిక సమర్పించకపోతే మహారాష్ట్రలో రాజకీయ పార్టీగా ఎంఐఎంను రిజిస్ట్రేషన్ ను రద్దుచేస్తామని హెచ్చరించింది. ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో ఎంఐఎం నేతలు పార్టీ గుర్తుపై మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండబోదు. వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయవచ్చు.
2015లో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం మంచి ఫలితాలు సాధించి అందరి దృష్టి ఆకర్షించింది. ఔరంగాబాద్ మున్సిపాలిటీలో 24 స్థానాలు సాధించి.. ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ అవతరించింది.