మోదీని ఇన్సల్ట్ చేసినందుకే.. అలా చేశాడు!
ముంబై: ఎయిరిండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దుష్ర్పవర్తన యావత్ దేశాన్నే కాదు.. ఆయన కుటుంబసభ్యులను కూడా విస్మయపరిచింది. తన భర్తలోని అంత దురుసు కోణాన్ని చూడటం ఇదే తొలిసారి అని గైర్వాడ్ భార్య ఉషా 'ముంబై మిర్రర్'కు తెలిపారు.
'నా భర్త ఎవనైనా అలా కొట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు. ఢిల్లీలో తొలిసారి ఆయనలోని హింసాత్మక కోణాన్ని చూశాను. ఎయిరిండియా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్లే ఆయన అలా ప్రతిస్పందించారు' అని ఆమె అన్నారు. తన భర్తకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఇలాంటి చర్యకు పాల్పడుతారని వ్యక్తిగతంగా ఆయన గురించి తెలిసినవారు ఎవరూ భావించరని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల కిందట ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో రంజాన్ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తికి బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించి.. గైక్వాడ్ వివాదం రేపిన సంగతి తెలిసిందే. తన భర్తకు అంత కోపం రావడం తానెప్పుడూ చూడలేదని, ఎయిరిండియా సిబ్బంది మొరటుగా ప్రవర్తించడం వల్లే ఆయన సహనం కోల్పోయారని ఆమె చెప్పారు.
విమానంలో ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టి.. వారిపై దౌర్జన్యపూరితంగా గైక్వాడ్ ప్రవర్తించడం సబబేనా అని ప్రశ్నించగా.. 'ఎయిరిండియా నాసిరకం సేవలు గురించి మా ఆయన ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఫిర్యాదు తీసుకోవడానికి బదులు వారు వాగ్వాదానికి దిగారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును అగౌరవపరుస్తూ అవమానకరంగా మాట్లాడారు. అందువల్లే ఆయన సహనం కోల్పోయారు' అని ఆమె అన్నారు.