ఎయిర్ఇండియాకు లక్ష జరిమానా
ఎయిర్ఇండియాకు లక్ష జరిమానా
Published Mon, Sep 26 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
ఎయిర్ఇండియా సంస్థ ప్రయాణికుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వ్యవహరించి పాడైపోయిన ఆహారాన్ని సర్వ్ చేసినందుకు అత్యున్నత వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. లక్ష రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ముంబాయి నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికులకు పాడైపోయిన ఆహారాన్ని సరఫరా చేసింది. దీనిపై మాలతీ మధుకర్ పహాడే అనే మహిళ ఎయిర్ ఇండియాలో పాడైపోయిన ఆహారాన్ని ప్రయాణికులకు సరఫరా చేసినట్టు వినియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు దాఖలు చేసింది. తన రైస్ బౌల్లో వెంట్రుకలు ఉన్నట్టు పేర్కొంది.
ఈ ఫిర్యాదుపై విచారించిన మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఎయిర్ఇండియాకు జరిమానా విధించి, ప్రయాణికులకు కనీస మర్యాద ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చింది. మంచి ఆహారాన్ని అందించాలని పేర్కొంది. అయితే దీనిపై అత్యున్నత వినియోగదారుల కమిషన్లో ఎయిర్ ఇండియా రివ్యూ పిటిషన్ 2015లో దాఖలు చేసింది. ఈ వివాదాన్ని విచారించిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్, రివిజన్ పిటిషన్ కొట్టేసింది. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వహిస్తూ పాడైపోయిన ఆహారం సరఫరా చేయడం ప్రయాణికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తీర్పునిచ్చింది. లక్షరూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సర్వీసులోని నిర్లక్ష్యం బట్టి జరిమానా విధించినట్టు బెంచ్ అధినేత జస్టిస్ అజిత్ బారిహోక్ తెలిపారు. వ్యాజ్యాల ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీచేశారు.
Advertisement