స్వామి అసిమానందకు విముక్తి
జైపూర్: అజ్మీర్ దర్గా బాంబు పేలుడు కేసులో స్వామి అసిమానందకు విముక్తి లభించింది. జైపూర్ లోని ప్రత్యేక ఎన్ ఐఏ కోర్టు బుధవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. మరో ఇద్దరికి క్లీన్ చీట్ ఇచ్చింది. మరో ముగ్గురు నిందితులు దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్, సునీల్ జోషి(మృతి చెందాడు)లను దోషులుగా నిర్ధారించింది. దేవేంద్ర, భవేశ్ లకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ నెల 16న శిక్ష ఖరారు చేయనుంది. నిర్దోషులుగా ప్రకటించిన వారిలో ఆర్ ఎస్ ఎస్ సీనియర్ సభ్యుడు ఇంద్రేశ్ కుమార్ కూడా ఉన్నారు.
అజ్మీర్ లోని సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిష్టి దర్గాలో 2007, అక్టోబర్ 11న ఉదయం 6.15 గంటలకు సంభవించిన బాంబు పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో 149 సాక్షులను కోర్టు విచారించింది. 451 పత్రాలను న్యాయస్థానం పరిశీలించింది. జనవరి మొదటి వారంలోనే కేసు విచారణను కోర్టు పూర్తి చేసింది.