
ములాయం, అఖిలేష్ వర్గాలు పోటాపోటీగా..
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో సాగుతున్న ఆధిపత్య పోరు ఢిల్లీకి చేరింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో సాగుతున్న ఆధిపత్య పోరు ఢిల్లీకి చేరింది. పార్టీ గుర్తు సైకిల్‌ను దక్కించుకునేందుకు ఇరు వర్గాలు పోటీపడుతున్నాయి. సోమవారం ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని కలసి సైకిల్ గుర్తును తమకు కేటాయించాల్సిందిగా కోరగా.. కాసేపటి తర్వాత ఆయనకు పోటీగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం ఈసీని కలిసింది.
అఖిలేష్ తరపున బాబాయ్, రాజ్యసభ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ఇతర నేతలు ఈసీని కలిశారు. సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని మరోసారి విన్నవించారు. అనంతరం రాంగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నేతలంతా తమతోనే ఉన్నారని, త్వరగా సమస్యను పరిష్కరించాలని ఈసీని కోరామని చెప్పారు. కాగా పార్టీ నుంచి బహిష్కరించిన విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అఖిలేష్ వర్గం ఇంతకుముందు కూడా ఈసీని కలిసి పార్టీలో మెజార్టీ వర్గం నాయకులు, ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, తమకే సైకిల్ గుర్తును కేటాయించాలని కోరారు.
(చదవండి: అఖిలేష్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు)