సీడబ్ల్యూసీతో అధ్యయనం | All party leaders meet Prime minister | Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీతో అధ్యయనం

Published Sat, Dec 21 2013 1:52 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

సీడబ్ల్యూసీతో అధ్యయనం - Sakshi

సీడబ్ల్యూసీతో అధ్యయనం

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయూన్ని వివరించిన రాష్ట్ర అఖిలపక్ష బృందానికి ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి హరీష్ రావత్‌ల నుంచి గట్టి హామీలేవీ లభించలేదు. అరుుతే ‘‘డిపెండబిలిటీని 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించిన విషయంలో మీరు చెబుతున్నది సరైనదేనని నేను అర్థం చేసుకున్నాను. ఈ అంశంపై అధ్యయనం చేయమని కేంద్ర జలసంఘాన్ని(సీడబ్ల్యూసీ) కోరతాను’’ అని మాత్రం ప్రధాని చెప్పారు. సుప్రీంలో పెండింగ్‌లో ఉన్న కేసులో కేంద్రం ఇంప్లీడ్ కావాలని అఖిలపక్షం అర్థించినప్పుడు ఏమీ మాట్లాడకుండా తలాడించారు. ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేయవద్దని ఒకటికి రెండుసార్లు విన్నవించినప్పుడు.. ‘‘ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే ఉంది కదా... అది తొలగించేలోపు మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీ వాదనలేవో అక్కడ వినిపించండి’’ అని సూచించారు. పక్కనే ఉన్న హరీష్ రావత్.. ‘‘ఇదంతా సుప్రీంకోర్టు పరిధిలోనిది. కేసులో మేం ఎంతవరకు జోక్యం చేసుకోవడానికి వీలుంటుందో చూస్తాం. ఇందుకు న్యాయపరమైన కొన్ని పరిమితులున్నాయి..’’ అని అన్నారు.
 
 ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అఖిలపక్ష ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని ఆయన నివాసంలో కలిసింది. అరగంటపాటు జరిగిన భేటీలో సీఎం, వివిధ పక్షాల నేతలు ట్రిబ్యునల్ తుదితీర్పు రాష్ట్రానికి చేసిన చేటును వివరించారు. సీఎంతో పాటు ప్రభుత్వం, కాంగ్రెస్ తరఫున భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మంత్రులు కె.జానారెడ్డి, పితాని సత్యనారాయణ, కె.పార్థసారథి, వైఎస్సార్‌సీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, బీజేపీ నుంచి నాగం జనార్ధన్‌రెడ్డి, శేషగిరిరావు, టీఆర్‌ఎస్ నుంచి వినోద్‌కుమార్, విద్యాసాగరరావు, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నుంచి కె.నారాయణ, గుండా మల్లేశ్, సీపీఎం తరఫున బి.వి.రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా తరఫున డి.రామారావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనారోగ్య కారణాలరీత్యా ఈ భేటీలో పాల్గొనలేకపోయారు. సమావేశం ఆరంభం కాగానే సీఎం కిరణ్ అఖిలపక్షం తరఫున 11 పేజీల నివేదనను ప్రధానికి అందజేశారు.
 
 తీర్పు ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండనున్నదీ వివరించారు. ఆ తర్వాత ఆయూ పార్టీల తరఫున ఒక్కొక్కరుగా వాదనలను వినిపించారు. ‘‘రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. మీరు వెంటనే జోక్యం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయండి’’ అని వారు అర్థించారు. అందరు చెప్పిందీ ప్రధాని సావధానంగా విన్నారు. ‘ట్రిబ్యునల్ తుది తీర్పును పరిశీలించాల్సి ఉంది.. అధ్యయనం చేశాక ఏం చేయాలో ఆలోచిస్తాం.. సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయిస్తా..’ అని చెప్పారు.  భేటీ చివర్లో సీపీఐ రాష్ట్ర నేత నారాయణ, బీజేపీ నాయకుడు నాగం, టీఆర్‌ఎస్ ప్రతినిధి వినోద్ విడివిడిగా వినతిపత్రాలను ప్రధానికి అందజేసినట్లు సమాచారం. భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మీడియూతో మాట్లాడకుండా వెళ్లిపోయూరు. ప్రధానితో భేటీకి ముందు ఏపీ భవన్‌లో సీఎం సమక్షంలో అఖిలపక్ష నేతలు కూర్చుని ఏయే అంశాలను గట్టిగా చెప్పాలనేది చర్చించారు.
 
 దయూర్ద్ర వైఖరి చూపండి
 ‘‘బ్రిజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర గాయాన్ని చేసేదిగా ఉన్నందున రాష్ట్రానికి న్యాయం జరిగేలా  దయార్ద్ర వైఖరిని చూపండి’’ అని ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో అఖిలపక్ష నేతలు కోరారు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలు విడుదల చేసే జలాలపైనే గణనీయంగా ఆధారపడుతోందని విన్నవించారు. ట్రిబ్యునల్ తీర్పు యావత్ దేశంలో ప్రతికూల పర్యవసానాలకు దారితీస్తుందని తెలిపారు. రాష్ట్ర రైతాంగం యావత్తూ తీవ్ర ఆందోళన చెందుతోందని, రైతులు, ప్రజలు, రాజకీయ పార్టీల నిరసనలు నిత్యకృత్యమయ్యాయని వివరించారు.
 
 వినతిపత్రం, నేతల వాదనల్లో ముఖ్యాంశాలు...
 +    డిపెండబిలిటీని 75% నుంచి 65 శాతానికి తగ్గించడం అంతర్జాతీయ, జాతీయ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాజెక్టులనూ ప్రభావితం చేస్తుంది. విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.
 
 +    కేంద్ర జలసంఘం ప్రాజెక్టులన్నింటినీ 75% డిపెండబిలిటీ ఆధారంగానే క్లియర్ చేస్తోంది. ప్రస్తుతమిది జాతీ య నిబంధనగా ఉంది. దేశంలోని మరే ఇతర ట్రిబ్యునల్ నదీజలాలను భిన్న డిపెండబిలిటీల వద్ద పంచలేదు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అన్ని నదీ జలాల పంపకాల విషయంలోనూ వివాదాలను సృష్టిస్తుంది.
 
 +    బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలపై పూర్తి హక్కును అత్యంత దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే బ్రిజేశ్ ట్రిబ్యునల్ వాటిని మూడు రాష్ట్రాలకు పంచింది. మిగులు జలాలపై పూర్తి హక్కులు ఎప్పుడైనా సరే అత్యంత కింది రాష్ట్రానికే చెందుతాయి. దీన్ని తోసిరాజని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని ఆరు ప్రాజెక్టులపై పెను ప్రభావం చూపుతుంది. మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన ఆరు ప్రాజెక్టులకు నీళ్లు కరువయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని ఆయకట్టు మొత్తం ఎడారిగా మారుతుంది. కృష్ణానది ప్రవాహానికున్న విచిత్ర స్వభావం రీత్యా వరదలు, కరువు.. తరచూ తలెత్తే ప్రకృతి విపత్తులుగా మారాయి. మిగులు జలాలను కుదించడంతో రాష్ట్ర రైతులకున్న అవకాశాలు మృగ్యమై పంటల పరిస్థితి అగమ్యగోచరమైంది. రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే ఈ నిర్ణయం అత్యంత ఆందోళన కలిగిస్తోన్న అంశం.
 
 +    నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టులకు 70 టీఎంసీల మేరకు నీటిని కేటాయించాలని కోరినప్పటికీ ఒక్క టీఎంసీని సైతం కేటాయించకపోవడం శోచనీయం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు తాగు, సాగునీరు అందించే ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ తీర్పు శరాఘాతమే. ఆయా ప్రాజెక్టులపై చేసిన వ్యయమంతా ఇప్పుడు వృథా కానుంది.
 
 +    డిపెండబిలిటీల ఆధారంగా నీటిని పంచడంతో ప్రాజెక్టుల నిర్వహణ దుస్సాధ్యమవుతుంది. ఈ పంపిణీ విధానం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ అనేక సమస్యలకు దారితీస్తుంది. ప్రాజెక్టుల ఆపరేషన్ షెడ్యూలును ఈ పంపిణీ విధానం దుర్లభం చేస్తుంది. ఫలితంగా ప్రాంతీయ, అంతర్ ప్రాంతీయ అసంతృప్తులు, వివాదాలు తలెత్తుతాయి.
 
 +    {బిజేశ్ ట్రిబ్యునల్ అపరిష్కృత అంశాలను పరిష్కరించాల్సిందిపోయి ఇప్పటికే పరిష్కారమై ఉన్న అంశాలను కూడా తిరగదోడి అపరిష్కృత జాబితాలోకి నెట్టింది.
 
 సీమ సమస్యలతో ఇంప్లీడ్ పిటిషన్
 
 రాయలసీమ అభివృద్ధి, హక్కుల ఫోరం నిర్ణయం

బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసే పిటిషన్‌లో రాయలసీమ సమస్యలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఇంప్లీడ్ కావాలని రాయలసీమ అభివృద్ధి, హక్కుల ఫోరం నిర్ణయించింది. ఈ మేరకు దాఖలు చేసే పిటిషన్‌లో రాజకీయ పార్టీలకతీతంగా సీమ ప్రాంతంలోని అందరి ప్రజా ప్రతినిధుల సంతకాలను సేకరించాలని తీర్మానించారు. సీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మిగలుజలాల మీదే ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని, తీర్పు కారణంగా ఆ ప్రాంతానికి జరిగే నష్టాన్ని పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
 
 ఫోరం ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంత ప్రజా ప్రతినిధుల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి సి.రామచంద్రయ్య, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి హాజరయ్యారు. ఫోరం నేతలు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎస్. రమణయ్య, వై.నాగిరెడ్డి, బొజ్జా దశరథ రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత ఫోరం నేత చంద్రశేఖరరెడ్డి మాట్లాడారు. ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్‌మెంట్ కోరుతున్నట్టు తెలిపారు. అపాయింట్‌మెంట్ దొరికితే హైదరాబాద్‌లోనే కలుస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి తమ ప్రాంత వెనుకబాటుతనం గురించి వివరిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement