సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై స్పష్టత
- ఇక వరుసగా నోటిఫికేషన్లు, దరఖాస్తుల ప్రక్రియ
- రేపు లేదా 13న ఎంసెట్ నోటిఫికేషన్
- 14 నుంచి ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు
- రెండు మూడు రోజుల్లో మిగతా ప్రవేశ పరీక్షలపైనా స్పష్టత
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైంది. దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు తదితర ఆన్‌లైన్ పనులను నిర్వహించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై తలెత్తిన వివాదం పరిష్కారమైంది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సమావేశమై చర్చించారు. టెండర్లలో తక్కువ రేటు కోట్ చేసిన సర్వీసు ప్రొవైడర్‌కే పనులను అప్పగించాలని కడియం సూచించారు. దీంతో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణపైనా సెట్స్ కన్వీనర్లు కసరత్తు ప్రారంభించారు. వీటిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన జారీ చేసే అవకాశముంది. ప్రవేశ పరీక్షల తేదీల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు.
15 రోజుల సమయం వృథా..!
సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయంలో సెట్స్ కన్వీనర్ల కమిటీ నిబంధనలు పాటించలేదంటూ కొందరు సర్వీసు ప్రొవైడర్లు ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దానిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని, సెట్స్ కన్వీనర్ల కమిటీని వివరణ కోరింది. అయితే తాము గతంలో తరహాలోనే సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపికకు చర్యలు చేపట్టామని.. ప్రస్తుతం ఎం చేయమంటారో ప్రభుత్వమే తేల్చాలంటూ ప్రభుత్వానికి విద్యా మండలి వివరణ ఇచ్చింది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంతో.. గత నెల 27న జారీ కావాల్సిన ఎంసెట్ నోటిఫికేషన్, ఈనెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ, 4న జారీ కావాల్సిన లాసెట్ నోటిఫికేషన్ ఆగిపోయాయి. తాజాగా ఈ సమస్య పరిష్కారమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 15 లేదా 16వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈనెల 14 నుంచి చేపట్టేలా ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాష్ చర్యలు ప్రారంభించారు.
షరతుతో ఆయుష్‌కు దరఖాస్తులు
ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా, ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ రాసినా సరైన స్పందన రాలేదు. సీబీఎస్‌ఈ ఇంకా నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలకు ప్రకటన జారీ చేయనందున ఎంసెట్‌లో చేర్చాలని మౌఖికంగా సూచించినట్లు సమాచారం. అయితే నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలు చేపడితే విద్యార్థులు నీట్ రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.