షిర్డీ ఎయిర్‌పోర్ట్ రెడీ
ముంబై: వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి షిర్డీకి వచ్చే భక్తులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయం నిర్మాణం పనులు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో వచ్చే నెల(జులై) మొదటి వారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఉపాధ్యక్షుడు, కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ కాకనీ అధికారికంగా ప్రకటన చేశారు.
ప్రారంభంలో ఎయిరిండియా చొరవ తీసుకుని ఇక్కడి నుంచి విమాన సర్వీసులు నడుపుతుందని, ఆ తరువాత జెట్ ఎయిర్ వేజ్ కూడా రంగంలోకి దిగుతుందని సరేశ్ కాకనీ చెప్పారు. అయితే షిర్డీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు సాగించేందుకు ఎంఏడీసీకి సంబంధిత విభాగం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. వచ్చే రెండు వారాల్లో అనుమతి లభించే అవకాశాలున్నాయి. దీంతో ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ప్రముఖుల అపాయింట్‌మెంట్ లభించగానే ముహూర్తం తేదీ ఖరారు చేస్తామని కాకనీ తెలిపారు.