shirdi airport
-
షిర్డీ ఎయిర్పోర్ట్ ప్రారంభం
సాక్షి,అహ్మద్‌నగర్: షిర్డీ యాత్రికులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం అహ్మద్‌నగర్‌లో ప్రారంభించారు. అనంతరం ముంబయికి అలయన్స్ ఎయిర్ కమర్షియల్ ఫ్లయిట్‌కు పచ్చజెండా ఊపారు.మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. షిర్డీ సాయిబాబా సమాధి వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో ఏడాది పొడవున జరిగే కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది భక్తులు షిర్డీ తరలిరానున్నారు. విమానాశ్రయం ప్రారంభం కావడంతో ముంబయి-షిర్డీల మధ్య 240 కిమీ దూరం ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి కేవలం 45 నిమిషాలకు తగ్గింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖలు పాల్గొన్నారు. -
షిరిడీకి వెళ్లడం ఇక చాలా తేలిక
సాక్షి, న్యూఢిల్లీ :షిర్డీకి వెళ్లే భక్తులకు శుభవార్త. సాయిబాబా దర్శనం చేసుకోవాలంటే గతంలో రైలు,బస్సు, ప్రైవేటు వాహనాల్లో షిర్డీకి వెళ్లాల్సి వచ్చేది. కానీ త్వరలోనే విమానంలోనూ షిర్డీకి వెళ్లొచ్చు. సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) గురువారం షిర్డీ ఎయిర్‌పోర్టుకు లైసెన్సు మంజూరు చేసింది. ఎయిర్‌బస్ ఏ-320, బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైనంత రన్‌వే ఉందని డీజీసీఏ తెలిపింది. రోజువారీ కార్యక్రమాల కోసం ప్రజల కోసం షిర్డీ ఎయిర్‌పోర్టుకు ఏరోడ్రోం లైసెన్స్ మంజూరు చేస్తున్నట్టు సీనియర్ డీజీసీఏ అధికారి చెప్పారు. కాక్డీ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కంపెనీ అభివృద్ధి చేసింది. రూ.350కోట్ల వ్యయంతో, 400హెక్టార్లలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. 2011లోనే ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ ఎయిర్‌పోర్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి ఈ విమానాలు సేవలు ప్రారంభమవనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. రోజుకు 500 మంది ప్యాసెంజర్లతో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లకు సేవలు ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి టెంపుల్‌కు వెళ్లడానికి బస్సు లేదా ట్యాక్సీ సర్వీసులను అందించనున్నారు. షిర్డీ టెంపుల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. -
ఇక షిర్డీకి విమాన రాకపోకలు
సాక్షి,న్యూఢిల్లీః షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులు ఇక నేరుగా విమానాల్లో షిర్డీ చేరుకోవచ్చు. షిర్డీ విమానాశ్రయానికి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గురువారం లైసెన్స్ జారీ చేయడంతో త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. షిర్డీ ఎయిర్‌పోర్ట్‌లో ఏ-320, బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలకు వీలు కల్పించేలా అత్యంత పొడవైన రన్‌వేను నిర్మించారు. విమానాశ్రయంలో అన్ని ప్రమాణాలు, వసతులను పరిశీలించిన అనంతరం షిర్డీ ఎయిర్పోర్ట్ ప్రయాణీకుల వినియోగానికి అవసరమైన ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను జారీ చేశామని డీజీసీఏ సీనియర్ అధికారి వెల్లడించారు. -
షిర్డీ ఎయిర్పోర్ట్ రెడీ
ముంబై: వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి షిర్డీకి వచ్చే భక్తులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయం నిర్మాణం పనులు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో వచ్చే నెల(జులై) మొదటి వారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఉపాధ్యక్షుడు, కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ కాకనీ అధికారికంగా ప్రకటన చేశారు. ప్రారంభంలో ఎయిరిండియా చొరవ తీసుకుని ఇక్కడి నుంచి విమాన సర్వీసులు నడుపుతుందని, ఆ తరువాత జెట్ ఎయిర్ వేజ్ కూడా రంగంలోకి దిగుతుందని సరేశ్ కాకనీ చెప్పారు. అయితే షిర్డీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు సాగించేందుకు ఎంఏడీసీకి సంబంధిత విభాగం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. వచ్చే రెండు వారాల్లో అనుమతి లభించే అవకాశాలున్నాయి. దీంతో ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ప్రముఖుల అపాయింట్మెంట్ లభించగానే ముహూర్తం తేదీ ఖరారు చేస్తామని కాకనీ తెలిపారు.