సోనియా జోక్యంతో కొలిక్కి వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 105 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఎస్పీ అంగీకరించింది. కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇరు పార్టీల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చెప్పారు.
తమకు 110 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టగా, 100 స్థానాలు మాత్రమే ఇస్తామని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కుదరని సంగతి తెలిసిందే. చివరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం జోక్యంతో 105 సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకరించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అఖిలేష్తో చర్చలు జరిపారు.