ఆ మంత్రులంతా చిత్తయ్యారు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తిన కాషాయ సునామీ.. అఖిలేశ్ మంత్రివర్గాన్ని దాదాపుగా కుప్పకూల్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అఖిలేశ్ మంత్రుల్లో నాలుగింట మూడొంతుల మంది చిత్తుగా ఓడిపోవడం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ అసెంబ్లీ స్పీకర్ మతా ప్రసాద్ పాండే సైతం బీజేపీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. తన కంచుకోట అయిన ఈట్వా నియోజకవర్గంలో పాండే బీజేపీ చేతిలో పరాజయంపాలై.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
అఖిలేశ్‌కు అత్యంత సన్నిహిత మంత్రులుగా ముద్రపడిన అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రాలు సైతం ఓటమిపాలయ్యారు. రాంనగర్, లక్నో నార్త్ నియోజకవర్గాల్లో వారు చిత్తయ్యారు. ఇక కళంకిత మంత్రి గాయత్రి ప్రజాపతిని ఏరికోరి మరీ అమేథి స్థానంలో ఎస్పీ నిలబెట్టినా.. ఆయనను ప్రజలు ఛీకొట్టారు. రేప్ కేసులో నిందితుడిగా ఉండి.. సుప్రీంకోర్టు నుంచి ఘాటు హెచ్చరికలు ఎదుర్కొన్న ప్రజాపతి ఎస్పీ సుప్రీం ములాయం యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో.. ఆయనకు అఖిలేశ్ సీటు ఇవ్వకతప్పలేదు. కానీ, రేప్ కేసులో పోలీసులకు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా ఆయన నిర్వహించిన మైనింగ్ శాఖ అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ఇక అఖిలేశ్ మంత్రివర్గంలోని రవిదాస్ మెహ్రోత్రాపై (లక్నో సెంట్రల్), శివకాంత్ ఓజా (రాణిగంజ్), జియావుద్దీన్ రిజ్వీ (సికందర్పూర్), అవదేష్ ప్రసాద్ (మిల్కిపూర్), వినోద్ కుమార్ అలియాస్ పండిట్ సింగ్ (తరాబ్‌గంజ్), రామ్మూర్తి వర్మ (అక్బర్ పూర్ ), శంక్‌లాల్ మాఝి (జలాల్పూర్), రాంకరణ్ ఆర్య (మహదేవ్), బ్రహ్మాశంకర్ త్రిపాఠి (కుషినగర్), కమల్ అక్తర్ (హసన్‌పూర్), రియాజ్ అహ్మద్ (పిలిభిత్), షహీద్ మంజూర్ (కిఠోర్) తదితర మంత్రులు ఓటమిపాలయ్యారు.
వివాదాస్పద మంత్రి ఆజంఖాన్ (రాంపూర్), రామ్ గోవింద్ చౌదరి (బన్సదీ), పరాస్ నాథ్ యాదవ్ (మల్హనీ), దుర్గాప్రసాద్ యాదవ్(సదర్), యాసిర్ షా (మటేరా), మెహబూబ్ ఆలీ (అమ్రోహ), ఇక్బాల్ మహమూద్ (సంభాల్), రఘురాజ్ ప్రతాప్ సింగ్ (కుండ), మనోజ్ కుమార్ పాండే (ఉచాహర్), నరేంద్ర సింగ్ వర్మ (మహమూదాబాద్) తదితర మంత్రులు మాత్రం కమలం ధాటిని తట్టుకొని విజయం సాధించారు.