టెస్టు సారథి కోహ్లిపై ధోనీ రేర్‌ కామెంట్స్‌! | Already having more interactions on the field with Virat Kohli, says MS Dhoni | Sakshi
Sakshi News home page

టెస్టు సారథి కోహ్లిపై ధోనీ రేర్‌ కామెంట్స్‌!

Published Sat, Oct 15 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

టెస్టు సారథి కోహ్లిపై ధోనీ రేర్‌ కామెంట్స్‌!

టెస్టు సారథి కోహ్లిపై ధోనీ రేర్‌ కామెంట్స్‌!

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మైదానంలో తాను తరచూగా ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటానని చెప్పాడు. అతను ఎవరో కాదు టెస్టు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లియే. ధోని కేవలం వన్డేలు, టీ-20లకు మాత్రమే నాయకత్వం వహిస్తుండగా.. టెస్టు జట్టుకు కోహ్లి సారథిగా ఉన్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో మూడు ఫార్మెట్లకు ఒకే కెప్టెన్‌ను నియమించే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మైదానంలో తాను తరచూ కోహ్లి నుంచి సలహాలు తీసుకుంటానని ధోనీ చెప్పడం గమనార్హం.

న్యూజిల్యాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి.. సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఈ నేపథ్యంలో కివీస్‌ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌లోనూ కోహ్లి సలహాలు అవసరమవుతాయని ధోనీ చెప్పుకొచ్చాడు. 'అతన్ని (కోహ్లి) ఎక్కువగా వాడుకోవడం నేను ఇప్పటికే ప్రారంభించాను. మీరు మ్యాచ్‌లను నిశితంగా గమనించినట్టయితే.. మైదానంలో నేను అతనితో ఎక్కువ సంప్రదింపులు జరుపుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న భిన్నమైన ఆలోచనలు పంచుకోవడానికి అది అవసరం' అని ధోనీ శనివారం విలేకరులతో చెప్పాడు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో భారత్‌-న్యూజిల్యాండ్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. న్యూజిల్యాండ్‌పై టెస్టు సిరీస్‌ గెలుపు నేపథ్యంలో కోహ్లిని మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెప్టెన్‌గా తన బాధ్యతలేమీ కొత్తగా మారకపోయినా.. భవిష్యత్‌ తరం క్రికెటర్లకు మెంటర్‌గా ఉండాల్సిన బాధ్యత అదనంగా వచ్చి చేరిందని ధోనీ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement