'నేను రాజకీయాల్లోకి రాను'
నల్లగొండ రూరల్: రాజకీయాల్లోకి తాను వెళ్లనని, నిరుద్యోగుల వెంట ఉండి పోరాడుతానని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం నల్లగొండలోని జయశంకర్ ప్రాంగణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ యువత, ఉద్యోగ, ఉపాధి-ప్రభుత్వ పౌరసమాజం పాత్ర’ అనే అంశంపై జరిగిన యువజన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాల కన్నా నిరుద్యోగులకు సంతోషాన్ని కలిగించేందుకే పనిచేస్తానన్నారు.
ప్రతి నిరుద్యోగి తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం ఒక విధానం ప్రకటించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మార్కెట్‌ను తెలంగాణ ప్రజానీకానికి ఉపయోగపడే విధానాన్ని రూపొందించాలని సూచించారు. తొలగించిన ఓసీటీఎల్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకునేందుకు సీఎం చొరవ తీసుకోవా లని కోరారు. కార్యక్రమంలో టీవీవీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ఎస్‌ఆర్ కృష్ణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిప్పర్తి యాదయ్య పాల్లొన్నారు.