
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావసభ విజయవంతమైందని, ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుం దని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం కృషి చేసే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆసక్తి ఉన్నవారు పార్టీలో చేరేందుకు దరఖాస్తులు పంపాలని కోరారు. రెండు రోజుల్లో దరఖాస్తు ఫార్మాట్‌ను ఫేస్‌బుక్, పార్టీ వెబ్‌సైట్, మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. దరఖాస్తుల పరిశీలనలకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు చేపట్టాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జీలను నియమిస్తున్నామని, వారు పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదుతోపాటు జిల్లా స్థాయిలో తాత్కాలిక కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడతారని చెప్పారు.
ఓటర్లను జాగృతం చేయండి
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదుకు ఈ నెల 8 వరకు గడువు ఉన్నందున.. ఓటర్ల నమోదుపై ప్రజలను జాగృతం చేయా లని కోదండరామ్ సూచించారు. పార్టీ మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని, ఆ చట్టం అమలుకు ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి చేస్తుందని వెల్లడించారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఇన్‌చార్జీల నేతృత్వంలో సదస్సులు, చర్చా కార్యక్రమాలు కొనసాగుతా యని గాదె ఇన్నయ్య తెలిపారు. సమావేశంలో రౌతు కనకయ్య, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, రవీందర్‌రావు, ధర్మార్జున్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment