సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని, పార్టీ లక్ష్యం అదేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. అందుకోసమే తాము పని చేస్తామని, ఆ దారిలోనే తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. డబ్బులు కుమ్మరించి, ప్రజలను మభ్యపెట్టి సాధించే గెలుపు తమకు అక్కర్లేదని, ఆ మార్గాన్ని తాము తిరస్కరిస్తున్నామన్నారు. గెలిచినా, ఓడినా ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీజేఎస్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు అంశాలు..
సాక్షి: పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో తెలంగాణ జన సమితి గెలుస్తుందని భావిస్తున్నారా?
కోదండరాం: ప్రస్తుతం ప్రచారమే కీలకం. గెలుపు, ఓటముల గురించి చర్చించే సమయం, సందర్భం ఇది కాదు. ఏ లక్ష్యం కోసం పోటీ చేస్తున్నాం.. ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం అనేది మా ప్రధాన కర్తవ్యం. ఈ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాన్ని పరిచయం చేసుకోవడం, లక్ష్యాలను తెలియజేయడం, వాటి ఆధారంగా ప్రజలను సంఘటితం చేయడం, తద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి దోహద పడటం ప్రధానం. అలా గెలుపు వైపు ప్రయాణిండమే మా ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం దాని కోసమే పని చేస్తున్నాం. మరోవైపు పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం కీలకమైన అంశంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ ఎన్నికల్లో మేము రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా ఒక స్థానంలో నామినేషన్ రిజెక్టు అయింది. ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్‌లో పోటీలో ఉన్నాం. హైదరాబాద్‌లో రిజెక్టు అయింది. అయితే ఈ పోటీని గెలుపోటముల అంశంగా మేము చూడట్లేదు. మేము ప్రయాణిçస్తున్న మార్గమే మాకు ముఖ్యం. ఎన్నికల్లో ప్రచారమే కీలకం. ఈ ప్రచారంతో పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. అందుకోసమే మేము పోటీలో ఉన్నాం. టీజేఎస్ ప్రజలకు న్యాయం చేసేందుకే పోరాడుతుంది. ప్రజాహక్కులకు భంగం వాటిల్లకుండా ఉద్యమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరించి గెలుపొందాలన్నదే మా భావన.
ప్రజాసమస్యలు అన్నపుడు ఆ రెండు స్థానాలనే ఎందుకు ఎంచుకున్నారు? మిగతా స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు కదా?
మహబూబాబాద్‌లో అటవీ హక్కుల చట్టం అమలు కావట్లేదు. చట్టానికి విరుద్ధంగా గిరిజన, గిరిజనేతరుల భూములను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభు త్వం వారిని ఖాళీ చేయించే పని చేస్తోంది. 83 వేల కుటుంబాలు తెలంగాణలో భూములను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఆ 83 వేల మం ది రైతుల సమస్యలను అటవీ హక్కుల చట్టం పరిధికి లోబడి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మా కీలక లక్ష్యం. దాని కోసమే మహబూబాబాద్‌ను ఎంచుకొని పోటీ చేçస్తున్నాం.
సీఎం16 స్థానాలు మేమే గెలుస్తాం.. వేరే పార్టీలకు అవకాశం లేదంటున్నారు కదా? మీరేమంటారు?
ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలుస్తామనే చెబుతుంది. అదే లక్ష్యంతో పోటీ చేస్తుంది. మేమూ అదే చేస్తున్నాం. గెలుస్తామనే ఆలోచనతో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఎవరూ ఓడిపోతామని ప్రకటించి పోటీ చేయరు. కేసీఆర్ చెబుతున్నదీ అదే. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహం, ఎత్తుగడ అదే.
అసెంబ్లీ ఎన్నికల నుంచి చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఉన్న వారు సైలెంట్‌గా ఉన్నారు? ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
కొంతమంది వ్యక్తులుగా వెళ్లిపోయారు. నిర్మాణానికి నష్టం లేదు. కొంత మంది నాయకులు వెళ్లినంత మాత్రన ఏమీ కాదు. పార్టీ నిర్మాణం యథాతథంగా ఉంది. కార్యకర్తలు అంతా పని చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ పనీ చెప్పడం లేదన్న అసంతృప్తిగా ఉన్నారు తప్ప మరేమీ కాదు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కోదండరాం లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.. భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా?
నేను పోటీ చేయాలా వద్దా అని సూత్రరీత్యా నిర్ణయమేమీ తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడమే కీలకం అనుకున్నాం. ఆ పరిస్థితులనుబట్టే ముందుకు వెళ్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పార్టీ నిర్మాణం, కేడర్‌గల నియోజకవర్గాల్లో స్థానిక నేతలకు అవకాశం ఇచ్చి పోటీలో దింపాం. అంతే తప్ప నేను పోటీ చేయకూడదని, పోటీ చేయబోనన్న నిర్ణయమేదీ లేదు.
టీజేఎస్ ఏర్పడి 11 నెలలు అవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయిందన్న విమర్శలపై ఏమంటారు?
అది వాస్తవం కాదు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల్లో జరిగిన తప్పులు, పొరపాట్లపై విస్తృతంగా తిరిగాం. గ్రామాల్లోకి సమగ్ర సమాచారాన్ని సేకరించాం. గ్రామ సమావేశాలు నిర్వహించాం. పార్టీ బలంగానే ప్రజల్లోకి వెళ్లింది. నిర్మాణం విస్తరిస్తోంది. ఈ 11 నెలల్లో ఎంతగా వెళ్లాలో అంతటా వెళ్లాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశాం. టీజేఎస్ అభ్యర్థులు దాదాపు 25–30 గ్రామాల్లో సర్పంచులుగా గెలిచారు. అంటే పార్టీ గ్రామ స్థాయికి వెళ్లినట్లే కదా. పైగా ఇవి పైసా వెచ్చించండా గెలిచిన స్థానాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే జిల్లా పరిషత్తులవారీగా ప్రణాళికలను రూపొందించాం. అన్ని జిల్లాల్లోనూ టీజేఎస్ పోటీలో ఉంటుంది.
పోటీ చేస్తున్న ఆయా స్థానాల్లో పార్టీ గెలుపు ఆలోచన లేదా?
ప్రజాసమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజల ఆదరణ పొంది గెలవాలన్నదే మా ఆలోచన. అలాగని ఎన్నికల్లో గెలుపు ఆలోచన లేదా అంటే ఉంది. మేము ఎంచుకున్న మార్గం ఇది. ఈ మార్గంలో ప్రయాణించి గెలుపు సాధించాలని ప్రయత్నిస్తున్నాం. గెలుపు వేరు, ఈ ప్రచారం వేరు అని కాదు. మేము ఎంచుకున్న మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రచారం చేసి గెలువాలన్నదే మా తపన. మామూలుగా డబ్బులు కుమ్మరించి, మందు పోసి, ప్రజలను మభ్యపెట్టి గెలువాలన్న ప్రయత్నాలు బాగా సాగుతున్న సమయంలో మేము ఆ మార్గాన్ని తిరస్కరిస్తున్నాం. ఒక భిన్నమైన మార్గంలో ముందుకు సాగుతున్నాం. సిద్ధాంతాల ప్రాతిపదికన గెలవడానికి ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యం చేయడం ద్వారా గెలవాలన్నది మా లక్ష్యం. ఇది కొత్తదేమీ కాదు.. రాజకీయాల్లో నిజంగా అనుసరించాల్నిస మార్గం ఇదే. ఆ మార్గాన్ని మేము అనుసరిస్తాం. గెలుపు కోసం కృషి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment