
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘తెలంగాణ జన సమితి’ పోటీ చేయాలని భావిస్తోందని జేఏసీ వర్గాల సమాచారం. ఇటీవలె జేఏసీ చైర్మన్ కోదండరాం తన నూతన పార్టీ తెలంగాణ జన సమితిని ప్రకటించారు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాలో ఒంటరిగానే పోటి చేస్తుందని కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో దానికి ముందు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై పూర్తి వివరాలను ఈ ఏప్రిల్ 4న జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటిస్తారని సమాచారం. ఏప్రిల్ 29న నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు పార్టీ భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తారని జేఏసీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 29న జరిగే బహిరంగ సభలో చాలా మంది ప్రముఖులు, ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని కోదండరాం తెలిపారు.