అమరావతి అసెండాస్‌కే..! | amaravathi construction contract to ascendas | Sakshi
Sakshi News home page

అమరావతి అసెండాస్‌కే..!

Published Sun, Oct 4 2015 3:46 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

అమరావతి అసెండాస్‌కే..! - Sakshi

అమరావతి అసెండాస్‌కే..!

- స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎంపికకు చంద్రబాబు నిర్ణయం
- కమీషన్లకోసం గ్లోబల్ టెండర్లకు మంగళం
- సింగపూర్ కంపెనీకి వేలాది ఎకరాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
- తొలిదశలో 3000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం
- సీఆర్‌డీఏ-సింగపూర్ కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా అభివృద్ధి
- ప్రతిఫలంగా సింగపూర్ కంపెనీ అసెండాస్‌కు 250 ఎకరాలు ఉచితంగా కేటాయింపు... భూముల విక్రయం, లీజులోనూ వాటా
- సర్వీసు ఛార్జీల పేరుతో వేలకోట్ల వసూలుకు అనుమతి
- రాజధాని నిర్మాణంకోసం కేంద్రం ఇచ్చిన
- రూ.1850 కోట్లలో ఒక్క పైసా ఖర్చుచేయని వైనం
 
సాక్షి, హైదరాబాద్:
నూతన రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్ ఎంపిక వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రపంచస్థాయి రాజధాని, పారదర్శకత అంటూ నిత్యం మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్లకోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం పక్కనబెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా పైసా ఖర్చుచేయలేదు. స్వలాభంకోసం రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి, తద్వారా భారీ స్థాయిలో కమీషన్లు దండుకునేందుకు స్విస్ ఛాలెంజ్ అనే బూటకపు పద్ధతిని ఎంచుకున్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులతో అత్యున్నత రాజధాని నిర్మించే అవకాశమున్నా, ఆ పనిచేయకుండా మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కంపెనీలకు పనులు కట్టబెట్టాలని సాక్షాత్తూ రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. తనను చూసి, తనకున్న పరిచయాలవల్లనే సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చిందంటూ చెప్పిన ముఖ్యమంత్రి... భూసమీకరణ, భూసేకరణ పేరుతో రైతులనుంచి బలవంతంగా గుంజుకున్న వేలాది ఎకరాలను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, వాటినుంచి భారీగా ముడుపులు అందుకునేందుకు పక్కా ప్రణాళికను రచించారు.

స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసేందుకు చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలను ‘సాక్షి’ ముందుగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే... రాజధాని నిర్మాణానికి ఏదైనా పేరున్న సంస్థ తక్కువకు కోట్ చేసినా ఆ సంస్థను మినహాయించి, తనకు నచ్చినవారికి తనకు వాటాలిచ్చేవారికి నిర్మాణ బాధ్యతలను అప్పజెప్పవచ్చు. అందుకే ఎలాగూ తమకు పనులు రావన్న భావంతో పేరున్న సంస్థలేవీ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవు.
 
అప్పనంగా భూముల అప్పగింత..
రాజధాని నిర్మాణం తొలి దశలో సింగపూర్ కంపెనీలకు 3000 ఎకరాలను అప్పగించనున్నారు. ఈ మూడు వేల ఎకరాలను సీఆర్‌డీఏ-సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్‌లో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు ప్రతిఫలంగా సింగపూర్ కంపెనీలకు అమరావతిలో 250ఎకరాలను ఉచితంగా కేటాయిస్తారు. ఆ ఉచితంగా కేటాయించే 250 ఎకరాల్లో సింగపూర్ కంపెనీలు ఐకానిక్ కాంప్లెక్స్‌ను నిర్మించి రియల్ ఎస్టేట్ వెంచర్‌లా విక్రయించుకుంటాయి.

ఇది చాలదన్నట్టు తొలి దశలో 3000 ఎకరాలు అభివృద్ధి చేసేందుకు అయిన వ్యయాన్ని అభివృద్ధి చార్జీల రూపంలో వేలకోట్లు ముక్కుపిండి వసూలు చేసుకోనున్నాయి. అలాగే నూతన రాజధానిలో వేలాది ఎకరాల భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో కూడా సింగపూర్ కంపెనీలకు వాటా ఉంటుంది. నూతన రాజధానిలో పరిశ్రమలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు భూములను 99 సంవత్సరాల పాటు లీజులకు ఇవ్వనున్నారు. ఆ భూములపై లీజుల ద్వారా వచ్చిన డబ్బులను, అలాగే సీఆర్‌డీఏ నిధికి వచ్చిన నిధులను ప్రభుత్వం మాస్టర్ డెవలపర్‌కు చెల్లించనుంది. అంటే కొద్దిపాటి పెట్టుబడితో వేలాదికోట్ల రూపాయలు దండుకునేందుకు సింగపూర్ కంపెనీలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించి, తద్వారా భారీగా లబ్ధి పొందనున్నారు.

ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్‌కు సింగపూర్ ప్రధానమంత్రి అంగీకరించలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 3000 ఎకరాల్లో అభివృద్ధికి వారం లేదా పది రోజుల్లోగా సింగపూర్‌కు చెందిన కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రతిపాదనలు సమర్పిస్తాయని, ఆ ప్రతిపాదనలను ఛాలెంజ్ చేసేందుకు ఉంచుతారని ఆయన చెప్పారు. 3000 ఎకరాల్లో 375 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ బాధ్యతలను తొలుత సింగపూర్ కంపెనీలకు అప్పగించాలని అనుకున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నందున ఆ కంపెనీలు అప్పగించాలా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
 
ప్రపంచస్థాయి బూటకం...
ప్రపంచస్థాయి రాజధాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నవనీ బూటకపు మాటలేనని ఆయన చర్యలను బట్టి అర్థమవుతోంది. నిజంగా ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న చిత్తశుద్ధి ఉంటే... అందరూ క్వాలిఫై అయ్యే విధంగా గ్లోబల్ టెండర్లను పిలవాలి. అప్పుడు వివిధ దేశాలకు చెందిన పేరున్న సంస్థలు పోటీ పడతాయి. ఎక్కువ కోట్ చేసిన వారికి పనులు అప్పగించడంవల్ల డబ్బు ఆదా అవుతుంది. రాష్ట్రానికి మంచి రాజధాని వస్తుంది. కానీ చంద్రబాబు తనకు రావాల్సిన వాటాలకోసం స్విస్ ఛాలెంజ్ విధానంలో తనకు నచ్చినవారికి పనులు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు.

అందుకే రాజధాని నిర్మాణంకోసం కేంద్రం ఇచ్చిన రూ.1850 కోట్లు నిధులను సైతం ఖర్చుచేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఎందుకంటే... కేంద్రం ఇచ్చిన డబ్బు ఖర్చు చేస్తే దానికి లెక్కలు చూపాలి. తనకు నచ్చినవారికి కాంట్రాక్టు ఇచ్చేందుకు కుదరదు. తనకు రావాల్సిన వాటా రాదు. అందుకే చంద్రబాబు ఇప్పటివరకూ రాజధాని నిర్మాణంకోసం ఇటుకకూడా పేర్చలేదు. తన స్వలాభంకోసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పక్కనపెట్టేశారు. కేంద్రం నిధులతో అసెంబ్లీ, రాజ్‌భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తే మిగతావాటికి కేంద్రం నిధులు ఇచ్చేది. రాజధాని చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి రూ.1000 కోట్లు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు కూడా.

ఇలా కేంద్రం ఇచ్చే నిధులతో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి జోనింగ్ చేస్తే కార్పొరేట్ కంపెనీలు తరలివచ్చేవి. తమకు కావాల్సిన మేరకు భూములను రైతులనుంచి కొనుక్కునేవి. రైతులు లాభపడేవారు. వ్యవసాయం చేయాలనుకునేవారు అలాగే ఉంచుకునేవారు. కానీ చంద్రబాబు రైతులనుంచి బలవంతంగా భూములను లాక్కుని సింగపూర్ సంస్థలకు కట్టబెడుతున్నారు. ఆ సింగపూర్ సంస్థలు కూడా మొత్తం రాజధానిని నిర్మించేదీ లేదు. కేంద్రం నిధులతో మనం నిర్మించుకోగలిగిన అసెంబ్లీ, రాజ్‌భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలనే అవీ నిర్మిస్తాయి. కానీ ప్రతి నిర్మాణంపైనా సర్వీసు ఛార్జీలు వేసి ముక్కుపిండి వసూలు చేసి వేలకోట్లను దండుకుంటాయి.
 
అసెండాస్ షరతులు?!
తొలి దశ రాజధాని అభివృద్ధి అక్టోబర్ 2018 నాటికి పూర్తి చేయడానికి అసెండాస్ అంగీకరించింది. సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారు ఉంటారని స్పష్టం చేసింది. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే పంచుకోవాలని పేర్కొంది. రాజధాని నిర్మాణంలో ఇతరత్రా భారాలకు బాధ్యత వహించడానికి ఎంత మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. సంయుక్త కమ్యునికేషన్ ప్రణాళికపై అవకాశాలను పరిశీలిస్తామని, సంయుక్త అమలు కమిటీకి, బహత్తర ప్రణాళికపై ఏపీ, సింగపూర్ మధ్య అవగాహన ఒప్పందానికి అంగీకరిస్తామని పేర్కొంది. మధ్యలో బాధ్యతల నుంచి తప్పుకునే క్లాజును చేర్చేందుకు అంగీకరించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement