
అంబులెన్స్ డ్రైవరా మజాకా!
బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణించే మార్గంలో వెళ్తున్న అంబులెన్స్‌ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవటం వివాదాస్పదమైంది. అయితే, అసలు విషయం వేరేలా ఉంది. అంబులెన్స్లో ఉన్నది రోగి కాదు.. మృతదేహం అన్న అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో ఆ ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలివీ.. స్థానిక జయదేవ ఆస్పత్రిలో దొడ్డమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ ఈనెల 2వ తేదీన చనిపోయింది. ఆమెను సొంతూరు కుణిగల్‌కు తరలించేందుకు కుటుంబీకులు దేవరాజు అనే అంబులెన్స్ నిర్వాహకుడిని ఆశ్రయించారు.
అతడు దొడ్డమ్మ మృతదేహాన్ని తన అంబులెన్స్‌లో వేసుకుని ఈనెల 4వ తేదీన సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలోనే సైరన్ మోగించుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని టౌన్‌హాల్ సమీపంలో ఆపేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో రావటంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్‌ను తీసుకెళుతున్నా సహించరా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ మేరకు దేవరాజును హలసూరు గేట్ పోలీసులు అరెస్టు చేశారు.