అమెరికాలోని మనవారిపై మరో విద్వేషపు పడగ!
- ఓహిలోని భారతీయుల విద్వేషపు వీడియో
- పెరిగిపోతున్న జాత్యాంహకారంపై ఎన్నారైల్లో గుబులు
తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల దారుణమైన హత్యోదంతం కళ్లుముందు కదలాడుతుండగానే.. అమెరికాలో విద్వేషపు పడగలు విచ్చుకుంటున్నాయి. అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఎగజిమ్ముతున్న జాత్యాంహకారాన్ని నిలువెల్లా ఒంటబట్టించుకుంటున్న అమెరికన్లు.. తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని భారతీయులపై విద్వేషం పెంచుకుంటున్నారు. వారు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రవాస వ్యతిరేకుల వెబ్‌సైట్ అక్కడ ఉన్న మనవారిలో మరింత గుబులు రేపుతోంది. ఓహిలోని కొలంబస్ నగరంలో విశ్రాంతి తీసుకుంటున్న భారతీయుల ఫొటోలు, వీడియోలు ఈ వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడమే కాదు.. మనవారికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నాయి.
సేవ్‌అమెరికాఐటీజాబ్స్.కామ్ పేరిట ఉన్న ఈ సైట్‌లో.. ఓహిలోని ఓ పార్కులో కాలక్షేపం చేస్తున్న భారతీయుల కుటుంబాల వీడియోను పోస్ట్ చేశారు. సంపన్న భారతీయులు ఓహి పట్టణాల్లోకి చొరబడి.. స్థానిక అమెరికన్లను నిర్వాసితులను చేశారంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలను ఈ వీడియోలో జోడించారు. మార్చ్ 6నాటికి ఈ వీడియోను 40వేలకుపైగా మంది యూట్యూబ్‌లో చూశారు.
వర్జినీయాకు చెందిన 66 ఏళ్ల కంప్యూటర్ ఇంజినీర్ స్టీవ్ పుషర్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. వాలీబాల్ ఆడుతున్న పెద్దలు, సైకిల్ తొక్కుతున్న చిన్న పిల్లల్ని వీడియోలో చూపిస్తూ.. 'ఇక్కడ ఎంతమంది విదేశీయులు ఉన్నారో చూస్తే నా దిమ్మ తిరిగిపోతోంది. ఈ ప్రాంతమంతా భారతీయులే ఉన్నారు. అమెరికన్ల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను వాళ్లు కొల్లగొట్టారు. భారతీయ జనాలు ఈ ప్రాంతాన్ని చెరపట్టారు. ఇది టేకోవర్ చేసుకోవడం లాంటిదే' అంటూ పుషర్ విద్వేష వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని వ్యంగ్యంగా 'మినీ ముంబై' అంటూ అభివర్ణించాడు. గత ఆగస్టులోనే అతను భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వీడియోను, ఓ పీడీఎఫ్ డాక్యుమెంట్ను కూడా పోస్టు చేశాడు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో విదేశీయులపై వ్యతిరేకత పెరిగిపోవడం, ఈ క్రమంలోనే శ్రీనివాస్ కూచిభొట్ల హత్య జరిగిన నేపథ్యంలో ఈ విద్వేషపూరిత వెబ్‌సైట్‌లో ఉన్న భారతీయుల ఫొటోలు, వీడియోలు ఉండటం అక్కడున్న మనవారిలో మరింత గుబులురేపుతోంది.