
ఐపీఎల్-10 ఫొటో సె'న్సే'షన్ చూశారా..?
ఐపీఎల్-10వ సీజన్ కు సంబంధించి ట్రోఫీతో 8 జట్ల కెప్టెన్లు ఉన్న ఫొటోను తొలిసారిగా మంగళవారం విడుదలచేశారు. మరి కొద్ది గంటల్లో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(ఉప్పల్) స్టేడియం వేదికగా ఐపీఎల్-10 పోటీ మొదలుకానుంది. బుధవారం రాత్రి 8 గంటలకు సన్ రైజర్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ నిర్వహణకు ముందు ప్రారంభవేడుకలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఓపెనింగ్ సెర్మనీలో నటి అమీ జాక్సన్ ('ఐ', 'రోబో2.0' ఫేమ్) ప్రత్యేక ప్రదర్శన ఇస్తోంది. ఈ మేరకు నిర్వహకులు ప్రకటనలో తెలిపారు.
కోల్ కతాలో శ్రద్ధా కపూర్.. ఢిల్లీలో పరిణితీ చోప్రా..
ఐపీఎల్ ప్రారంభమై దశాబ్ధం పూర్తవుతోన్న సందర్భంగా, గత సంప్రదాయాలకు భిన్నంగా ఈ సారి ఎనిమిది వేదికల్లో (ఆయా టీమ్ ల హోమ్ గ్రౌండ్స్ లో) ప్రారంభవేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో అమీ జాక్సన్, ముంబైలో జరిగే ప్రారంభవేడుకలో రితేశ్ దేశ్ ముఖ్, గుజరాత్ లో టైగర్ ష్రాఫ్, కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో శ్రద్ధాకపూర్, ఢిల్లీలో నిర్వహించే ప్రారంభవేడుకలో పరిణీతి చోప్రా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మిగతా వేదికల్లో ఏయే స్టార్లు మెరిపిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.
47 రోజులు.. 60 మ్యాచ్ లు
ఏప్రిల్ 5న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే ఐపీఎల్-10 సీజన్.. మే 21న హైదరాబాద్ లోనే జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. 47 రోజులపాటు విభిన్న వేదికల్లో మొత్తం 60 మ్యాచ్ లు జరుగుతాయి. సోనీ మ్యాక్స్, సోనీ ఈఎస్పీఎన్ చానెళ్లలో ప్రత్యక్షప్రసారమయ్యే మ్యాచ్ లను Sony LIV యాప్ లేదా www.sonyliv.com. ద్వారానూ వీక్షించొచ్చు.