ఐఐటీల్లో 5 శాతం సీట్ల పెంపు
⇒ కసరత్తు చేస్తున్న జాయింట్ అడ్మిషన్ బోర్డు
⇒ త్వరలోనే తుది నిర్ణయం
⇒ ఇకపై ఏటా 5% పెంచే యోచన
హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) సీట్లు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ధన్‌బాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ (ఐఎస్ ఎం) సహా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 500లకు పైగా సీట్లను పెంచేందుకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. విదేశీ విద్యార్థుల కోసం ఇప్పటికే ప్రతి ఐఐటీలో 10శాతం సీట్లను పెంచాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా, దేశీయ విద్యార్థుల కోసం మరో 5 శాతం సీట్లను పెం చేందుకు జేఏబీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఐఐటీల కౌన్సిల్‌తోనూ సంప్రదింపులు జరుపు తున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్‌లో 10 సీట్లు, ఏపీలోని తిరుపతి ఐఐటీలో 6 సీట్లు పెంచే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసు కోనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో పెం చిన సీట్లలో ప్రవేశాలు చేపట్టాలని జేఏబీ భావి స్తున్నట్లు తెలిసింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందు లో టాప్ 2 లక్షల మందిని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తోంది. ఇందులో ర్యాంకు సాధించిన 10 వేల మందికిపైగా మాత్రమే ప్రవేశాలు కల్పి స్తోంది. లక్షలాది విద్యార్థులు పోటీపడుతున్నా సీట్లు తక్కువగా ఉండటంతో చాలా మంది నిరాశకు గురి కావాల్సి వస్తోంది. దీంతో ఏటా 5% మేర సీట్లను పెంచడం ద్వారా విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని భావిస్తోంది.