ఆంధ్రా బ్యాంక్ నవతరం బ్రాంచ్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ఏర్పడి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 90 నవతరం(నెక్స్‌ట్ జనరేషన్) శాఖలను ప్రారంభించింది. బుధవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు కె.కె.మిశ్రా, ఎస్.కె.కల్రా లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగుల సహాయం లేకుండానే రోజులో 24 గంటలు సాధారణ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేటట్లు ఈ నెక్స్‌ట్ జనరేషన్ శాఖలను ఏర్పాటు చేశారు.
ప్రధానమైన పట్టణాల్లోని కొన్ని శాఖల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలోని ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా నగదు డిపాజిట్, విత్‌డ్రా, అకౌంట్ స్టేట్‌మెంట్ వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ సంవత్సరం ఉగాది నాడు ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ శాఖలకు ఆదరణ బాగుండటంతో వీటిని విస్తరిస్తున్నట్లు కల్రా తెలిపారు. సొంతంగా లావాదేవీలు నిర్వహించే వారికి సహాయ పడే విధంగా ఫ్లోర్ మేనేజర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి నెక్స్‌ట్ జనరేషన్ శాఖల సంఖ్యను 250కి పెంచనున్నట్లు కల్రా తెలిపారు.