విజయవాడ లెనిన్ సెంటర్ లో అంగన్ వాడీల మౌనప్రదర్శన
సాక్షి, విజయవాడ బ్యూరో: అంగన్‌వాడీల ఆందోళనలతో రాష్ట్రం మరోసారి దద్దరిల్లింది. వేతన పెంపు అమలు జీవోను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళనకు దిగిన అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కడుపు నింపే జీవోను జారీ చేస్తారనుకుంటే కడుపుకొట్టే మెమోను జారీ చేస్తారా? అంటూ అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, సీఐటీయూ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్(మెమో) ప్రతులను దహనం చేశారు. జీతాలు పెంచమని అడిగినందుకు గతంలో గుర్రాలతో తొక్కించిన బాబు.. అటు తర్వాత అధికారం కోల్పోవాల్సి వచ్చిందని, మహిళలపై వేధింపులు ఆపకపోతే తమ ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.
తిరుపతి కలెక్టరేట్ ఎదుట..
రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసి స్తూ తిరుపతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకురాలు వాణిశ్రీ మాట్లాడుతూ.. మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వమూ ప్రజల మన్ననలు అందుకోలేదన్నారు.
విజయవాడలో మౌనప్రదర్శన..
విజయవాడ లెనిన్ సెంటర్‌లోనూ నిరసన ప్ర దర్శన నిర్వహించారు. చలో విజయవాడ ఆం దోళనపై విరుచుకుపడిన పోలీసులు దారుణం గా వ్యవహరించారని, అది చాలదన్నట్లు విధు ల నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళనను కొనసాగిస్తామన్నారు.
తూర్పుగోదావరిలో..
తూర్పుగోదావరి జిల్లా అంగన్‌వాడీల నిరసనలతో మార్మోగింది. ఆందోళనలో పాల్గొన్న ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ.. జీవో ఇస్తారనుకుంటే తమ కడుపుకొట్టే మెమో ఇస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మెమోను ఉపసంహరించుకుని, గతంలో ఇచ్చిన హామీ మేరకు జీతాల పెంపు జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరిలో మెమో ప్రతుల దహనం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పాతబస్టాండ్ వద్ద జరిగిన ఆందోళనలో మెమో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర నాయకురాలు భారతి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసిన అంగన్‌వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వం మెమో ఇవ్వడం అన్యాయమన్నారు. అంగన్‌వాడీ మహిళలపై చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నెల్లూరులో గాంధీ విగ్రహానికి మొర...
నియంతృత్వ పోకడలు విడనాడేలా చంద్రబాబుకు మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుతూ నెల్లూరులో గాంధీ విగ్రహం వద్ద మెమో ప్రతులను దహనం చేశారు.
వైఎస్సార్ జిల్లాలో కలెక్టరేట్ ఎదుటే..
వైఎస్సార్ కడప జిల్లాలో కడప కలెక్టరేట్ ఎదుటే మెమో ప్రతులను తగులబెట్టారు. ప్రొద్దుటూరు, పులివెందుల ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రాస్తారోకో చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద మెయిన్ రోడ్డుపై మెమోలు తగులబెట్టారు. కర్నూలులోని సుందరయ్య సెంటర్‌లోనూ మెమో ప్రతులను తగులబెట్టారు.
మెమో ప్రతులు మింగేసి...
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వద్ద మెమో ప్రతులను దగ్ధం చేయడానికి ప్రయత్నించిన ఏఐటీయూసీ కార్యకర్తలు, అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. మెమో తగలబెట్టడానికి వీలులేదని పోలీసులు వాదనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆందోళనకు దిగిన మహిళలు ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రతులను చించివేసి, వాటిని నమిలి మింగేయడంతో పోలీసులు కంగుతిన్నారు. జగదాంబ సెంటర్‌లో సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.