
భూసేకరణకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా పరిణమించిన భూముల సేకరణను సులభతరం చేసేందుకు అనువైన భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారం బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
భూములు లాక్కోవడానికి అనువుగా బిల్లు
- వివాదాస్పద చుక్కల భూముల బిల్లుకి ఆమోదముద్ర
- ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయం
- పోలవరం ప్రాజెక్టు మొబిలైజేషన్ అడ్వాన్సు రికవరీ వాయిదా
- మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి
రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా పరిణమించిన భూముల సేకరణను సులభతరం చేసేందుకు అనువైన భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారం బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం రైతులు, సామాన్యుల నుంచి వేల ఎకరాల భూములు సేకరించే క్రమంలో తిరుగుబాటు వ్యక్తమవుతుండడంతో 2013 భూసేకరణ చట్టాన్నే మార్చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రంలో ఈ చట్టాన్ని మార్చే వీలు లేకపోయినా మార్చాలని నిర్ణయించి దానికి రూపకల్పన చేసి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చట్టంలో మార్పులకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో అనుమతి వచ్చిన తర్వాత బిల్లును అమల్లోకి తేవాలని నిర్ణయించింది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా నిర్ణయాలు వెల్లడించకపోయినా విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. వివాదాస్పదమైన చుక్కల భూముల క్రమబద్ధీకరణ బిల్లు–2017కు మంత్రివర్గంలో ఆమోదం తెలిపింది. చుక్కల భూముల రిసెటిల్‌మెంట్ రిజిష్టర్‌ను ఈ బిల్లు ద్వారా మార్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల 1.84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని, 3.41 లక్షల చుక్కల భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంచనా. పోలవరం పనులకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సు రికవరీని వాయిదా వేసేందుకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి..
⇒ ఎటువంటి అభ్యంతరాలు లేని ఆక్రమణలో ఉన్న 100 గజాల లోపు నివాస స్థలాలు క్రమబద్ధీకరించవచ్చని మంత్రుల కమిటీ చేసిన సిఫారసుకు ఆమోదం. అర్బన్ ఏరియాలో 100 గజాల్లోపు భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించినట్టే ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయం.
⇒ అగ్రిగోల్డ్ కేసులకు సంబంధించి పరారీలో ఉన్న వ్యక్తుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల అవార్డు ఇవ్వాలని నిర్ణయం. డిపాజిట్లు వచ్చే అవకాశం లేదనే బాధతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షలు ఇచ్చే అవకాశం పరిశీలన. గురువారం దీనిపై అసెంబ్లీలో సీఎం ప్రకటన.
⇒ డిపాజిటర్ల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1999 (అపార్టుమెంట్) బిల్లును సవరించి 2017 బిల్లుగా సవరించేందుకు ఆమోదం.
⇒ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి అనంతరం మాతృ సంరక్షణ నిమిత్తం మదర్ కిట్ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం. రూ.800 కిట్‌తో నర్సింగ్ కవర్, ఆరు ప్యాకెట్ల శానిటరీ నాప్‌కిన్స్, ఒక బ్లాంకెట్, ఒక థర్మో స్టీల్ ఫ్లాస్క్ ఇస్తారు. బసవ తారకం మదర్ కిట్ పేరుతో ప్రసవానంతరం తల్లులకు ఇస్తారు. 13 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను తరలించేందుకు రవాణా వాహనాల ఏర్పాటుకు అనుమతి.
⇒ రాష్ట్రంలో కొత్తగా ఫిషరీస్, ఓషన్ వర్సిటీ ఏర్పాటు బిల్లుకు ఆమోదం. రూ.300 కోట్ల అంచనాతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసే ఈ వర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం మించకుండా వాటా ఉంటుంది. కనీసం 50 ఎకరాల్లో దీన్ని నెలకొల్పేందుకు ఆరుగురు సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, రెండు నెలల్లో సిఫారసులు చేయించేలా చూడాలని నిర్ణయం. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఈ వర్సిటీలో ప్రవేశపెడతారు.
⇒ రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) రూల్స్–2017కి సంబంధించిన ముసాయిదా రూపకల్పనకు అనుమతి.
⇒ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసిన మోడల్ బిల్డింగ్ బైలాస్–2017 ముసాయిదాకు ఆమోదం.
డెంటిస్ట్ యాక్ట్‌కు సవరణ
- డెంటిస్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 27 సవరణకు ఆమోదం. ఈ సెక్షన్‌ను అడ్డుపెట్టుకుని ఏపీ డెంటల్ కౌన్సిల్ సభ్యులుగా నలుగురు 20 ఏళ్లుగా కొనసాగుతుండడంతో దీనికి సవరణ చేయాలని నిర్ణయం.
- చిత్తూరుజిల్లా తాగునీటి ప్రాజెక్టుకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను 3 వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయం. అడ్వాన్సుపైవడ్డీమాఫీ, టెండర్ల అనంతరం వ్యయాన్ని తిరిగి చెల్లించడం, రికవరీ మొత్తం ఉపసంహరణ కు ఆమోదం.
- ఒంటిమిట్ట నిర్వాసితుల కోసం నిర్మించిన కాలనీకి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రూ.101.85 లక్షల విడుదలకు ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీకి అనుమతిం.
- ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇచ్చేందుకు అంగీకారం.
- వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు డెవలపర్‌తో ఒప్పందం చేసుకోవడానికి విశాఖ మున్సిపల్ కమిషనర్‌కు అనుమతి.
- శ్రీ లక్ష్మీ అమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్టు అమరావతిలో ఏర్పాటుకు ఆమోదం.
పలు పోస్టుల భర్తీకి ఆమోదం
- మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), డిప్యూటీ డైరెక్టర్ (మైన్స్), మరో నాలుగు సహాయక పోస్టుల భర్తీకి ఆమోదం. డీడీ పోస్టుల నియామకాలతో రూ.17.66 లక్షలు, మిగిలిన పోస్టులకు రూ.21.03 లక్షలు ఏడాదికి జీత భత్యాల కింద ఖర్చుకు అనుమతి.
- విశాఖ జిల్లా పెద గంట్యాడ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ కార్యాలయ నిర్వహణ, పారిశుధ్యం, ఇతర అవసరాల నిమిత్తం 12 పోస్టులను అవుట్‌సోర్సింగ్, రెగ్యులర్ పద్ధతుల్లో భర్తీకి అనుమతి. ఇందుకు రూ.85 లక్షల బడ్జెట్ కేటాయింపు.
- తూర్పుగోదావరి జిల్లా పెరుమాళ్లపురలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం 27 టీచింగ్, మూడు నాన్ టీచింగ్ పోస్టులను అవుట్‌సోర్సింగ్, రెగ్యులర్ పద్ధతుల్లో భర్తీకి ఆమోదం. టీచింగ్ పోస్టులకు రూ.2.18 కోట్లు, నాన్ టీచింగ్ పోస్టులకు రూ.13.32 లక్షలు కేటాయింపు.
- తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఒక లైబ్రేరియన్ పోస్టు, మరో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు నియమించేందుకు, కెమిస్ట్రీ, బయాలజీ లెక్చరర్ల పోస్టులు రెండింటిని రద్దు చేసేందుకు ఆమోదం.