న్యూఢిల్లీ:సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ మేరకు ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును మారుస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కలిసి ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మార్చుతూ దక్షిణమధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం నవంబర్ 15 వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
ఇదిలా ఉండగా విజయవాడ నుంచి న్యూఢిల్లీల మధ్య ఏపీ ఎక్స్ ప్రెస్ పేరుతో రైలును నడపడానికి దక్షిణమధ్య రైల్వే కసరత్తులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపే యోచనలో దక్షిణమధ్య రైల్వే ఉంది.