చంద్రబాబువి పచ్చి అబద్ధాలు | AP TDP Leaders behave like injection psychos, says rk roja | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి పచ్చి అబద్ధాలు

Published Mon, Nov 30 2015 3:42 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

చంద్రబాబువి పచ్చి అబద్ధాలు - Sakshi

చంద్రబాబువి పచ్చి అబద్ధాలు

సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన మాటలు వింటూంటే ప్రజలు భయపడిపోతున్నారని...

* 15 శాతం వృద్ధిరేటు సాధిస్తామనడం కోతలే: ఎమ్మెల్యే రోజా ధ్వజం
* దేశ వృద్ధిరేటే ఏడు శాతం.. ఏపీలో మాత్రం 15 శాతం ఎలా సాధ్యం?
* 15 శాతం వృద్ధిరేటు సాధించడం మాటేమోగానీ..
* బాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో వెళ్లిపోయింది

సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన మాటలు వింటూంటే ప్రజలు భయపడిపోతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు.

ఆమె ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చేఏడాది కల్లా రాష్ట్రంలో 15% వృద్ధిరేటు(జీడీపీ) సాధించాలని ఊహకందని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ వృద్ధిరేటు ఉండే చైనాలోనే 7.40%, భారత్‌లో 7% ఉంటే ఏపీలో మాత్రం 15% లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడంచూస్తే.. సీఎంగా మాట్లాడుతున్నారా? లేదా పోలిగాడి మాదిరి బొంకుతున్నారా? అనిపిస్తోందన్నారు.

‘బొంకరా...బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయలంత..’ అన్నట్లుగా చంద్రబాబు మాటలున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కరువు, వరదలతో కుదేలైందని, విభజన తరువాత పరిశ్రమల్లో 70 %, ఐటీ రంగంలో 95% హైదరాబాద్‌లోనే ఉండిపోతే ఏపీలో వృద్ధిరేటు రెండింతలెలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. వాస్తవికం గా సాధించగలిగేవి, గతంలో ఎవరైనా సాధిం చినవే లక్ష్యాలుగా నిర్ణయించుకోవాలిగానీ ఇలాంటి అబద్ధాలు చెప్పరాదన్నారు.

ఆయన గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా చేసినపుడూ రెండంకెల వృద్ధిరేటు(డబుల్ డిజిట్) సాధిం చిన దాఖలాల్లేవని, అలాంటిది ఇపుడెలా సాధ్యమని రోజా ఆశ్చర్యం వెలిబుచ్చారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తాను నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఇలాగే అబద్ధాలు చెబుతూపోయారని, ఆయన మాటలు వింటున్న స్వీడన్ ఆర్థికమంత్రి జోక్యం చేసుకుని తమ దేశంలో రాజకీయవేత్తలు ఇలాంటి మాటలు మాట్లాడితే జైలుకు పంపుతాం.. లేదంటే పిచ్చాసుపత్రికి పంపుతామన్నారని ఆమె గుర్తుచేశారు. సాధ్యంగాని, అసంబద్ధమైన మాటలు చెబుతున్న చంద్రబాబును ఎక్కడికి పంపాలో ఆయనే నిర్ణయించుకోవాలని, ‘ఆప్షన్ ఏ జైలు.. ఆప్షన్ బి పిచ్చాసుపత్రి...’ అని రోజా ఎద్దేవా చేశారు.
 
టీడీపీ రికార్డులు చాలా ఉన్నాయి..
పద్దెనిమిది నెలల టీడీపీ పాలనలో సాధించిన రికార్డులు, అభివృద్ధి చాలానే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థుల ఆత్మహత్యల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారన్నారు. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చేయడంలో దేశంలోనే నంబర్‌వన్‌గా టీడీపీ పాలనలో గణుతికెక్కారన్నారు. చింతమనేనిలాంటి ఎమ్మెల్యేలు మహిళలను దూషించడాన్ని బాబు వెనకేసుకొస్తున్నారని ఆమె తప్పుపట్టారు.

బాబుకు ఆడపిల్లల్లేరు కనుక వారి బాధలు తెలియవని, అందుకే తనచుట్టూ ఉన్న బొండా ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల లాంటివారు మహిళా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా ప్రోత్సహిస్తున్నారని రోజా విమర్శిం చారు. రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు సాధించడం మాటేమోగానీ.. చంద్రబాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డంగా దోచేసుకుంటున్నారని, టీడీపీ వారి దోపిడీలో వృద్ధిరేటు 15 శాతం కాదు.. 150 శాతం ఉందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
 
టీడీపీవాళ్లు సైకో సూదిగాళ్లు
టీడీపీలో ఉన్నవాళ్లంతా సైకో సూదిగాళ్లలా తయారయ్యారని, తమ న్యాయమైన కోర్కెల సాధనకు ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ మహిళలను సూదులతో గుచ్చడం, వారికి రక్తం వచ్చేలాగా కొట్టడం వంటివి చేయిస్తున్నారని రోజా విమర్శించారు. అంగన్‌వాడీ టీచర్లనుద్దేశించి చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. మహిళలనుద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడుతున్న టీడీపీ నేతల్ని వారి భార్యలు, కుమార్తెలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement