తూర్పు వెళితే చౌకే! | Apartments/Flats for Sale in Hyderabad | Sakshi
Sakshi News home page

తూర్పు వెళితే చౌకే!

Published Sat, Dec 14 2013 6:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

తూర్పు వెళితే చౌకే! - Sakshi

తూర్పు వెళితే చౌకే!

సాక్షి, హైదరాబాద్:  హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలంటే ఎక్కడ చూసినా రూ.30 లక్షల పైనే పలుకుతోంది. మరి అంతకన్నా తక్కువకు... అందుబాటు ధరల్లో దొరుకుతున్నదెక్కడ? ఇది తెలుసుకోవటంలో భాగంగానే ‘సాక్షి రియల్టీ’ తూర్పు హైదరాబాద్‌పై దృష్టి పెట్టింది. ఉత్తర, పశ్చిమ, దక్షిణ హైదరాబాద్‌లతో పోలిస్తే ఇది మధ్య తరగతికి అనువైన ప్రాంతం. మిగతా ప్రాంతాల్లో నగరం నుంచి కనీసం 30 కి.మీ. వెళితే కానీ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు గజం స్థలం దొరకటం లేదు. తూర్పు హైదరాబాద్‌లో మాత్రం... నగరం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఆ ధరకు ప్లాట్లు దొరుకుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి ఊపు తీసుకొస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు ఇక్కడినుంచే ప్రారంభమవుతోంది కూడా.
 
 దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్ నగర్, నాగోల్ నుంచి నాదర్‌గుల్, స్నేహపురి నుంచి హస్తినాపురం, కొత్తపేట నుంచి కర్మన్‌ఘాట్, తుర్కయాంజాల్ నుంచి బాటసింగారం... ఇవీ తూర్పు హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలు. జాతీయ రహదారి, ఇన్నర్ రింగ్‌రోడ్డు, కామినేని అస్పత్రులతో తూర్పు హైదరాబాద్‌కు మంచి గిరాకీ ఉంది. దీనికి తోడు నాగోల్- ఎల్బీ నగర్‌లలో మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే పడింది. దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు ఇక్కడ భారీ ప్రాజెక్టులు, షాపింగ్ మాళ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలు విద్య, వినోదం, వ్యాపారం... ఇలా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందాయి. నివాస, వాణిజ్య సముదాయాల గిరాకీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మూసారంబాగ్ చౌరస్తా నుంచి చైతన్యపురి దాకా రహదారికిరువైపులా ఎన్నో వాణిజ్య సముదాయాలు వెలిశాయి. చైతన్యపురిలో గజం రూ.30 వేల నుంచి రూ. 40 వేలుంది. రామకృష్ణాపురంలో అయితే రూ.25 నుంచి రూ. 28 వేలు. ఇంకా తక్కువ కావాలంటే స్నేహపురి, అల్కాపురిలో ప్రయత్నించొచ్చు.
 
 సొంతింటికి రహదారి..
 విజయవాడ జాతీయ రహదారి నుంచి నాగార్జున సాగర్ వెళ్లే రహదారి వరకు ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రూ.20 నుంచి రూ.25 లక్షలకే  ఫ్లాట్ లభిస్తోంది. తుర్కయాంజాల్, మన్నెగూడ, అల్మాస్‌గూడ, జిల్లెలగూడ, మీర్‌పేటలో ఇండిపెండెంట్ గృహాలు కూడా రూ.25 లక్షలకు వస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, మన్సూరాబాద్‌లలో అయితే కాస్త ఖరీదెక్కువ. కాస్త ఖర్చెక్కువైనా పర్వాలేదు నగరంలో ఉండాలనుకునేవారికి కర్మన్‌ఘాట్, చంపాపేట అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గజం ధర రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ చెబుతున్నారు. కుంట్లూరు, పసుమాముల, తట్టిఅన్నారం, తారామతిపేటల్లో కొత్తకాలనీలు వస్తున్నాయి. ప్రాంతాన్ని బట్టి చదరపు గజం ధర రూ.1,500-5,000 చెబుతున్నారు. కోహెడ, పెద్ద అంబర్‌పేటల్లో వెయ్యి నుంచి రెండు వేల వరకూ ఉంది. అభివృద్ధి చేసిన లేఅవుట్లు, జాతీయ రహదారికి అనుకుని ఉన్నవి అయితే రూ.5 వేల వరకూ చెబుతున్నారు.
 
 ఇటు మెట్రో.. అటు రేడియల్
     కారిడార్-1లో భాగంగా మియాపూర్- ఎల్బీ నగర్ మధ్య 28.87 కి.మీలలో మెట్రో వస్తోంది. ఇప్పటికే నాగోల్ -ఎల్బీనగర్ మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్బీనగర్ నంచి మియాపూర్ వెళ్లే మెట్రోరైలు... విక్టోరియా మెమోరియల్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ స్టేషన్లలో ఆగుతుంది.
 
     ఎల్బీనగర్ ఓపెన్‌స్టేడియంలో 1.5 ఎకరాల్లో 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో మెట్రో మాల్స్ ఏర్పాటుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సన్నాహాలు చేస్తోంది.
 
     నాగోల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వంద ఎకరాల్లో రైల్వే డిపోను అభివృద్ధి చేయబోతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డును అనుసంధానిస్తూ నాగోలు-గౌరెల్లి రేడియల్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది.
 
 అందుబాటు ధరల్లో: టీఎన్‌ఆర్
 ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వల్ల రియల్ వ్యాపారం జోరుతగ్గిన ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 5 లక్షల చ.అ. విస్తీర్ణంలో పలు ప్రాజెక్ట్‌లను నిర్మించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 లక్షల చ.అ. విస్తీర్ణంలో 4 భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని టీఎన్‌ఆర్ గ్రూప్ సీఎండీ టి. నరసింహారావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. హస్తినాపురంలో 6 ఎకరాల్లో ‘టీఎన్‌ఆర్ సులక్షణ’ పేరుతో మెగా టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలియజేశారు. దీన్లో మొత్తం ఫ్లాట్లు 490. తొలి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా నిర్మిస్తున్నారు.
 

  •   ఈ సంస్థ లాలాపేట్‌లో 2 ఎకరాల్లో రామ్ థియేటర్ పేరుతో నివాస, వాణిజ్య సముదాయాన్ని, కర్మన్‌ఘాట్‌లో మూడున్నర ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
  •   ఇంకా ఎల్బీనగర్ చౌరస్తాలో ‘వైష్ణవి శిఖర’ పేరుతో 14 అంతస్తుల లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 70 ఫ్లాట్లు. 1,800 చ.అ. నుంచి 2,300 చ.అ. మధ్య అన్నీ మూడు పడక గదుల ఫ్లాట్లే ఉంటాయి.
  •     అదే రోడ్డులో ఎకరంన్నర విస్తీర్ణంలో ‘వైష్ణవి’ పేరుతో మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నారు. ఇవి కూడా 70 ఫ్లాట్లు. 1,400 చ.అ. నుంచి 1,600 చ.అ. మధ్య అన్నీ మూడు పడకగదుల ఫ్లాట్లే. టీఎన్‌ఆర్ అన్ని ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ స్థాయిలో వసతులను కల్పిస్తున్నట్లు నరసింహారావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement