నేను నిద్రపోనివ్వనుగా ..!
బీజింగ్: వాహనాన్ని నడిపే సమయంలో నిద్రమత్తు, అలసటకు గురయ్యే డ్రైవర్లను అప్రమత్తత చేసేందుకుగాను నూతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. నిద్రమత్తు కారణంగా జరిగే ఘోర ప్రమాదాలను నివారించేందుకు ఈ నూతన యాప్ ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రైవర్లు ముందుగా ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం డ్రైవింగ్ చేసే సమయాల్లో యాప్‌ను ఆన్ చేసి ఫోన్‌ను డ్రైవర్ తలకు ఎదురుగా.. స్టీరింగ్‌కు దగ్గర్లో ఉంచాలి. ప్రయాణ సమయంలో ఈ యాప్ డ్రైవర్ల ముఖకవళికలను గమనిస్తూ ఉంటుంది.
డ్రైవర్ ముఖంలో ముఖ్యంగా కనురెప్పలు, తల పొజిషిన్‌ను ఫోన్ కెమెరాతో వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఈ రెండింటిలో ఏవైనా మార్పులు కలిగినట్లయితే ఈ యాప్ తక్షణమే పెద్దగా శబ్ధం చేస్తుందని యాప్‌ను అభివృద్ధి చేసిన చైనాలోని హాంగ్‌కాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వివరించారు. సెన్సార్లు, ఇతర పరికరాల సహాయం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌తోనే ప్రమాదాలను కాపాడవచ్చని, అదనంగా ఖర్చు కూడా అవసరం లేదని వారు పరిశోధకులు తెలిపారు.