ఐఫోన్‌తో.. టూరు ఖర్చు రాబట్టేయొచ్చు!
పురుషులందు పుణ్య పురుషులు వేరయా... అన్నట్లు సెల్‌ఫోన్లలో ఆపిల్ ఐఫోన్లు వేరయా అనాల్సిందే. మైండ్ బ్లాకయ్యే ఫీచర్లతో పాటు నాజూగ్గా ఉండే ఐఫోన్‌ను ఇష్టపడని వారెవరు చెప్పండి! ఇక, బంగారు రంగులో మిలమిలలాడే ఐఫోన్ 5ఎస్ చూసి ప్రపంచమంతా ఫ్లాటైపోతోంది. దాన్ని చేజిక్కించుకోవడానికి తహతహలాడుతోంది.
ఇతర దేశాలతో పోలిస్తే... అమెరికాలో ఐఫోన్ ధరలు తక్కువ. ఐఫోన్ 5ఎస్ (32 జీబీ) ధర అక్కడ అన్ని పన్నులతో కలిపి 815 డాలర్లు. అదే ఇటలీలో అయితే 1,130 డాలర్లు! ఐఫోన్లు ప్రపంచంలో ఎక్కడైనా హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. అందుకే, ఇతర దేశాల వారు అమెరికా వెళ్లినపుడు వీటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొంటున్నారు. తమ దేశానికి తిరిగి వెళ్లినపుడు వాటిని విక్రయించడం ద్వారా అమెరికా టూరుకు అయిన ఖర్చును తిరిగి సంపాదిస్తున్నారు. కొందరైతే లాభాలు జేబులో వేసుకుంటున్నారు కూడా.
లాభానికి అమ్ముకోవడం కోసం ఫోన్లను కొనడానికి వచ్చే వారితో అమెరికాలోని ఐఫోన్ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. ఒక ఐఫోన్ ఇవ్వండి అంటూ కొనుగోలుదారులు అడగ్గానే ఒకటి చాలా అని షాపు వాళ్లు అడగడం పరిపాటిగా మారింది. ఎందుకంటే, ఐఫోన్ స్టోర్లకు వచ్చే వారు రెండు, మూడు ఫోన్లను కొంటున్నారు మరి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో కొనేవారూ ఉన్నారు. ముఖ్యంగా గోల్డ్ మోడల్‌ను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే, ఈ మోడల్‌కు యూరప్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. క్షణాల్లో రీసేల్ అయిపోతుంది! డాలర్, యూరోల మాదిరిగానే ఐఫోన్ కూడా అంతర్జాతీయ కరెన్సీకి ఓ రూపంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు.
అక్కడ కొనడం... లాభానికి అమ్మడం ...
విదేశీ పర్యటనలకు వెళ్లేవారు అక్కడ చౌకగా దొరికే వస్తువులు కొని తమ దేశంలో అమ్ముకోవడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. ఆసియా దేశాల వారు గతంలో ప్యారిస్‌లో తక్కువ ధరకు లభించిన లూయిస్ వ్యూటన్, గుచ్చి హ్యాండ్‌బ్యాగులు కొని తమ దేశంలో అధిక రేటుకు విక్రయించే వారు. తూర్పు యూరప్‌లో ఉండే అమెరికన్లకు 1990వ దశకంలో లివైస్ జీన్స్ ఈ తరహా ఆర్థిక వెసులుబాటు కల్పించేవి. ఇప్పుడు ఐఫోన్లు... ముఖ్యంగా గోల్డ్ 5ఎస్ హవా నడుస్తోంది.
రెండు ఫోన్లతో పర్యటన ఖర్చు వచ్చినట్లే...
ఐఫోన్ 5ఎస్ గతేడాది లండన్లో విడుదలైంది. అప్పటికింకా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించలేదు. నాడు లండన్ వెళ్లిన భారతీయులు ఐఫోన్ స్టోర్లకు ఎగబడే వారు. రెండు ఫోన్లు కొని ఇండియాలో వాటిని అమ్మితే చాలు, లండన్ పోను, రాను ఖర్చులు గిట్టుబాటయ్యేవి. ఐఫోన్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలడం తమ కంపెనీ లాభాలు పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అంటున్నారు. జూలై క్వార్టర్లో చైనాలో ఆపిల్ ఆదాయం 14 శాతం క్షీణించడానికి హాంకాంగ్‌లో క్రయవిక్రయాలు మందగించడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికాలో చౌక...
ఐఫోన్ 5ఎస్ (16 జీబీ) అమెరికాలో చౌకగా 700 డాలర్లకు దొరుకుతోంది. ఇదే మోడల్‌ను బ్రెజిల్‌లో కొనాలంటే 1,200 డాలర్లు, ఇటలీలో అయితే వెయ్యి డాలర్లు వదిలించుకోవాల్సిందే.