
నంబర్ వన్ బ్రాండ్.. యాపిల్
న్యూయార్క్: ప్రపంచ అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్ అవతరించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన అత్యంత విలువైన అంతర్జాతీయ బ్రాండ్ల జాబితాలో 10,430 కోట్ల డాలర్ల (గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధి)విలువతో యాపిల్‌కు అగ్రస్థానం దక్కింది. యాపిల్ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. యాపిల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, కోక-కోలా, ఐబీఎం, గూగుల్‌లు నిలిచాయి. ఒక్క భారతీయ కంపెనీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఈ ఫోర్బ్స్ జాబితా వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..,
- ఏ ఇతర బ్రాండ్ల విలువ కన్నా యాపిల్ బ్రాండ్ విలువ రెట్టింపుగా ఉండడం విశేషం.
- గత మూడేళ్లుగా మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువలో (5,670 కోట్ల డాలర్లు)పెద్దగా మార్పు లేదు. పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ నుంచి మొబైల్ బ్రాండ్‌గా మారడానికి చాలా కష్టాలు పడుతోంది. అయినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 34% సాధించి అత్యంత లాభదాయక అంతర్జాతీయ బ్రాండ్లలలో ఒకటిగా నిలిచింది.
- 5,490 కోట్ల డాలర్ల విలువతో కోక-కోలా మూడో స్థానంలోనూ, 5,070 కోట్ల డాలర్లతో ఐబీఎం నాలుగో స్థానంలోనూ, 4,730 కోట్ల డాలర్లతో గూగుల్ ఐదో స్థానంలోనూ ఉన్నాయి.
- ఇక మొదటి పది స్థానాల్లో మెక్‌డొనాల్డ్స్(బ్రాండ్ విలువ 3,940 కోట్ల డాలర్లు), జనరల్ ఎలక్ట్రిక్(3,420 కోట్ల డాలర్లు), ఇంటెల్(3,090 కోట్ల డాలర్లు), శామ్‌సంగ్(2,950 కోట్ల డాలర్లు), లూయిస్ వ్యూటన్(2,840 కోట్ల డాలర్లు)చోటు సాధించాయి.
- గత ఏడాది 610 కోట్ల డాలర్లుగా ఉన్న బ్లాక్‌బెర్రీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 220 కోట్ల డాలర్లకు పడిపోవడంతో టాప్ 100 జాబితా నుంచి బ్లాక్‌బెర్రీని తొలగించారు.
- మూడేళ్ల క్రితం 2,730 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో 9వ స్థానంలో ఉన్న నోకియా కంపెనీ ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విలువతో 71వ స్థానానికి పడిపోయింది.
- ఈ టాప్ 100 బ్రాండ్లలో సగం అమెరికావే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ(9 కంపెనీలు), ఫ్రాన్స్(8), జపాన్(7) ఉన్నాయి.