
మంచువెన్నెల్లో రంగులు కురిసే హరివిల్లు!
ప్రకృతి అందాలు ప్రకృతివి. మనిషి సృజనాత్మకత మనిషిది. రెండూ కలిస్తే? ఈ ప్రపంచం ఓ కొత్త వండర్‌లాండ్ అయిపోతుంది. అలాంటి లాండ్ ఒకటి ఫిన్లాండ్‌లో ఉంది.
ప్రకృతి అందాలు ప్రకృతివి. మనిషి సృజనాత్మకత మనిషిది. రెండూ కలిస్తే? ఈ ప్రపంచం ఓ కొత్త వండర్‌లాండ్ అయిపోతుంది. అలాంటి లాండ్ ఒకటి ఫిన్లాండ్‌లో ఉంది.
నిండు పున్నమి... అర్ధరాత్రి... ఆరు బయట తలకింద చేతులు పెట్టుకుని ఆకాశంలో చందమామను, నక్షత్రాలను చూస్తూంటే... ఓహో.. ఆ మజాయే వేరు అనిపిస్తుంది. మరి... దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఆకాశంలో ఓ రంగుల హరివిల్లు విరిస్తే ఎలా ఉంటుంది? అదికూడా మంచుముద్దల మధ్యలో వెచ్చగా దుప్పటి కప్పుకుని ఆకాశం రంగులు మారడాన్ని చూడటం ఎలాంటి అనుభూతినిస్తుంది? ఈ విషయం తెలియాలంటే మీరు ఫొటోలో కనిపిస్తున్న రిసార్ట్‌కు (విడిది ప్రాంతం) వెళ్లాల్సిందే.
ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న చిన్న దేశం ఫిన్లాండ్‌లో ఉందీ రిసార్ట్. ఏటా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే చిత్రవిచిత్రమైన వెలుగుల్ని (నార్తర్న్ లైట్స్ అని, అరోరా బోరియాలిస్ అని వీటికి పేర్లు) రిసార్ట్‌లోని ఇగ్లూల్లోంచి (మంచు ఇళ్లు) రాత్రంతా చూసే అవకాశముండటం దీని ప్రత్యేకత. సూర్యుడి నుంచి వెలువడే ఉత్తేజిత కణాలు... వాతావరణం నుంచి వెలువడే వాయు కణాలను ఢీకొనడం వల్ల రకరకాల రంగుల్లో వెలుగులు ప్రసరిస్తాయి. కాక్‌స్లావుట్టానెన్ రిసార్ట్‌లో మొత్తం 20 ఇగ్లూలు మాత్రమే ఉన్నాయి. బయట ఉష్ణోగ్రత మైనస్ 22 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయినా లోపల మాత్రం వెచ్చగా ఉండేలా ఈ ఇగ్లూల పైకప్పు మొత్తాన్ని థర్మల్ గ్లాస్‌తో కప్పి ఉంచారు. ఏటా ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకూ రాత్రిపూట మాత్రమే కనిపించే ఈ వెలుగులను చూసేందుకు ప్రపంచం మొత్తం నుంచి పర్యాటకులు వస్తూంటారు. ఇగ్లూలతోపాటు ఈ రిసార్ట్‌లో స్మోక్ సానా, రెస్టారెంట్ తదితర హంగులన్నీ ఉన్నాయి.