
సంతోషంలో వెనుకబడ్డ భారత్
వాషింగ్టన్/ లండన్: రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనాసరే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ముందుకుసాగే పౌరులున్న దేశంలో నిరంతరం ఆనందం వెల్లివిరుస్తుంది. ఫిన్లాండ్‌లో ప్రజలు ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గురువారం విడుదలైన ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక–2025లో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
నంబర్‌వన్ ర్యాంక్‌ను ఫిన్లాండ్ సాధించడం ఇది వరసగా ఎనిమిదోసారి కావడం విశేషం. డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 118వ ర్యాంక్ సాధించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సి టీలోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వార్షిక నివేదికను రూపొందించారు. ఆయా దేశాల పౌరుల ఆదాయాల వ్యయాలు, వృద్ధి మాత్రమే కాకుండా వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు, పరస్పర నమ్మకం, సామాజిక మద్దతు, ఆత్మ సంతృప్తి, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దానగుణం, అవినీతి స్థాయి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఈ నివేదికకు తుదిరూపునిచ్చారు.
మీ జీవితాలకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? వంటి విభిన్నమైన ప్రశ్నలకు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రజల సమాధానాలు రాబట్టి నివేదికను తయారుచేశారు. విశ్లేషణ సంస్థ గాలప్, అమెరికా సుస్థిరాభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్‌లతో కలిసి ఈ నివేదికను సిద్ధంచేశారు. అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఈ జాబితాను విడుదల చేశారు.
భారత్ కంటే మెరుగైన స్థానంలో పొరుగుదేశాలు
గత ఏడాది 126వ ర్యాంక్‌తో పోలిస్తే భారత్ ఈసారి మెరుగ్గా 118వ ర్యాంక్ సాధించింది. అయితే భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు అంతకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. చైనా 68వ ర్యాంక్, నేపాల్ 92 ర్యాంక్, పాకిస్తాన్ 109వ ర్యాంక్ సాధించాయి. యుద్ధంలో మునిగిపోయిన పాలస్తీనా ప్రాంతం, ఉక్రెయిన్ సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంక్‌లు పొందటం విశేషం. పాలస్తీనా ప్రాంతం 108వ ర్యాంక్, ఉక్రెయిన్ 111వ ర్యాంక్ సాధించాయి. అయితే శ్రీలంక 133వ ర్యాంక్, బంగ్లాదేశ్ 134వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి. బ్రిటన్‌కు 23 ర్యాంక్ దక్కింది. మొత్తం జాబితాలో అఫ్గానిస్తాన్ చిట్టచివరన నిలిచింది. గత ఏడాది అఫ్గానిస్తాన్‌కు 143వ ర్యాంక్ వస్తే ఈఏడాది 147వ ర్యాంక్ వచ్చింది.
అమెరికాకు 24వ ర్యాంక్
ప్రపంచ పెద్దన్నగా అన్ని దేశాలపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందిగానీ ఆ దేశ ప్రజలు ఆనంద విషయంలో అంతేస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోలేకపోయారు. అమెరికా కేవలం 24వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 13 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న అమెరికా ఇçప్పుడు 24వ ర్యాంక్‌కు పడిపోయింది.
ఇక హమాస్ యుద్ధంతో ఇజ్రాయెల్ పౌరులు విసిగిపోయారని వార్తలొస్తున్నా వ్యక్తిగత, సమాజ జీవితంలో వాళ్లు మెరుగ్గా ఉన్నారని నివేదిక ప్రకటించింది. జాబితాలో ఇజ్రాయెల్ 8వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్ (5), కోస్టారికా (6), నార్వే (7), ఇజ్రాయెల్ (8), లక్సెంబర్గ్ (9), మెక్సికో (10) తొలి 10 ఆనందమయ దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కోస్టారికా, మెక్సికోలు టాప్– 10లో నిలవడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment