శశికళ కుటుంబానికి సేవలు చేయాలా?
అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యులలో ఆయనొకరు. పార్టీలో జయలలిత తర్వాత దాదాపు అంతటిస్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి పెద్దమనిషి తొలుత శశికళ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ తర్వాత బయటకు వచ్చేసి పన్నీర్ సెల్వానికి బహిరంగంగా మద్దతు పలికారు. ఆయనే ఇ. మధుసూదనన్. పార్టీ ప్రిసీడియం చైర్మన్. శశికళ కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మరణం తర్వాత శశికళ స్వతంత్రంగా, గౌరవప్రదంగా పార్టీని నడిపిస్తారని తాను భావించాను గానీ.. క్రమంగా ఆమె కుటుంబ సభ్యులంతా పెత్తనం చేయడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. దాన్ని తాను భరించలేకపోయానని చెప్పారు.
ఓపీఎస్‌కు జరిగిన అవమానం విషయం కూడా తనకు తొలుత తెలియదని, ఆ తర్వాత తెలిసి.. రేపు తనకు కూడా అలా జరగబోదన్న నమ్మకం ఏముందని భావించినట్లు మధుసూదనన్ తెలిపారు. ప్రిసీడియం చైర్మన్ స్థానంలో ఉన్న తాను, ఇతర నాయకులు శశికళ కుటుంబానికి సేవలు చేసేందుకు లేమని, పార్టీని కాపాడాలన్నదే తన ధ్యేయమని అన్నారు. తొలుత శశికళ మేనల్లుడు దినకరన్ వచ్చాడని, ఆ తర్వాత మొత్తం కుటుంబం అంతా దిగిపోయిందని చెప్పారు. జయలలిత ఎవరెవరిని బహిష్కరించారో వాళ్లంతా ఇప్పుడు మళ్లీ వచ్చేసి పార్టీపై పెత్తనం చలాయిస్తున్నారని మండిపడ్డారు.
డీఎంకేలో కుటుంబ పాలనను తాను ఎప్పుడూ వ్యతిరేకించానని, ఇప్పుడు అవే రాజకీయాలు సొంత పార్టీలోకి వస్తే ఎలా భరిస్తానని ప్రశ్నించారు. పన్నీర్ సెల్వానికి డీఎంకే మద్దతు లేనే లేదని, తామిద్దరం అన్నాడీఎంకే వ్యవస్థపక సభ్యులమని చెప్పారు. అయినా రాష్ట్రాన్ని పాలించాలనుకున్న డీఎంకే.. పన్నీర్ సెల్వానికి మద్దతు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తన రక్తంలో చివరి బొట్టువరకు డీఎంకేను వ్యతిరేకిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలను దాదాపు అరెస్టు చేసినంత పని చేశారని, చివరకు అసెంబ్లీలో బల నిరూపణ వరకు వచ్చేసరికి వాళ్లలో చాలామంది ఓపీఎస్‌కే మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. జయలలిత మరణించి మూడు నెలలు కూడా కాకముందే శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారని, ఆమెకంత తొందర ఎందుకుని మధుసూదనన్ ప్రశ్నించారు.