ఫ్లాష్: జైలుపై దాడి.. తీవ్రవాద చీఫ్ పరార్
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. ఆ తర్వాత హతమైన ఘటనను మరిచిపోకముందే.. పంజాబ్‌లో పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు ఒక జైలుపై విరుచుకుపడ్డారు. పంజాబ్‌లోని నభా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. మింటూతోపాటు పరారైన నలుగురు కూడా గ్యాంగ్‌స్టర్లే కావడం గమనార్హం. గుర్‌ప్రీత్ సింగ్, విక్కీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్‌జీత్ సింగ్ అలియాస్ విక్కీ జైలు నుంచి పరారయ్యారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఖలీస్థాన్ చీఫ్‌ను జైలు నుంచి విడిపించుకొని వెళ్లేందుకే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఖలీస్థాన్ చీఫ్ జైలు నుంచి పరార్ కావడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పంజాబ్‌లో వేర్పాటువాద చిచ్చును రగిలిస్తున్న ఖలీస్థాన్ చీఫ్‌ను 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పంజాబ్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు మింటూ పాకిస్థాన్ ఐఎస్‌ఐ నుంచి థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందాడని పోలీసులు గుర్తించారు.