పరికర్‌తో పాటు 8 మంది మంత్రులు
దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వస్తున్న మనోహర్ పారికర్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ మీడియాకు తెలిపారు. ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు మంత్రులు కేబినెట్‌లో ఉంటారని, వాళ్లలో గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి ఇద్దరు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు కూడా ఉంటారని ఆయన వివరించారు. బీజేపీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు.
ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాతో పాటు మరొకరు కూడా ప్రమాణం చేస్తారని, వాళ్ల పేర్లను మంగళవారం ఉదయం ప్రకటిస్తామని వినయ్ టెండూల్కర్ చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం ఆగి చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మరో ముగ్గురు లేదా నలుగురికి చాన్స్ రావచ్చన్నారు. 21 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని, అందువల్ల ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు మనోహర్ పారికర్ లేఖ రాయడంతో.. గవర్నర్ మృదులా సిన్హా ఆయనను సీఎంగా నియమిస్తూ ఆదివారం రాత్రే ఉత్తర్వులిచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు పారికర్ వెంట జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ నాయకుడు సుదిన్ ధావలికర్ కూడా ఉన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు హాజరవుతారు.