
ఆర్టికల్-3ని సవరించి, చర్చించాలి: జగన్
న్యూఢిల్లీ : లోక్‌సభలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తీర్మానాలను ఇచ్చింది. కేంద్రానికి అపరిమిత అధికారాలను ఇస్తోన్న ఆర్టికల్-3ని సవరించాలని, దీనిపై చర్చ జరగాలని కోరింది. అలాగా అవిశ్వాసంపై చర్చ జరగాలని పార్టీ తీర్మానాన్ని ఇచ్చింది. ఓట్ల కోసం, సీట్ల కోసం తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోడానికే ఈ ప్రయత్నాలని పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. వైఎస్ జగన్ రేపు పాట్నా వెళ్లనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో సమావేశమయి.. సమైక్యానికి మద్దతివ్వాల్సిందిగా కోరనున్నారు.
మరోవైపు అవిశ్వాస తీర్మానంపై అడుగు ముందుకు పడకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహ, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు, టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణ రావు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు అందాయని స్పీకర్ మీరా కుమార్ ఈ రోజు కూడా సభలో ప్రకటించారు.
దానిపై చర్చ జరగాలంటే ముందు సభ సజావుగా ఉండాలని... సభ్యులంతా వారి వారి స్థానాలకు వెళ్లి కూర్చొవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. పోడియంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ సభ్యులు మాత్రం ఆందోళన కొనసాగించారు. అవిశ్వాసంపై చర్చించేందుకు 50 మంది సభ్యుల్ని లెక్కించాల్సి ఉంటుందని పదే పదే చెప్పిన స్పీకర్.... గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.