మా ప్రశ్నలకు బదులివ్వండి: కేజ్రీవాల్
మోడీకి కేజ్రీవాల్ లేఖాస్త్రం
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రశ్నాస్త్రాలు సంధించింది. అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తారో లేదో తేల్చి చెప్పాలని మోడీని డిమాండ్ చేసింది. శుక్రవారం పలు ప్రశ్నలతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్.. మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ చదివి వినిపించారు. దానిలో ప్రధానాంశాలు..
ప్రధాని అభ్యర్థి అయిన మీరు (మోడీ).. ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే గ్యాస్ ధరను 8 డాలర్ల నుంచి 4 డాలర్లకు తగ్గిస్తారో, లేదో తెలుసుకోవాలని సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు.
ఆర్‌ఐఎల్ అధినేత ముకేష్ అంబానీతో మీకూ, కాంగ్రెస్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే మౌనం దాల్చుతున్నారా? ఆర్‌ఐఎల్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వానీని రాజ్యసభకు ఎంపిక చేయడంలోనే ముకేష్‌తో మీ సంబంధాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని మీరు పదే పదే చెపుతున్నారు. అంబానీలకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. వాళ్ల డబ్బునూ వెనక్కి రప్పిస్తారా?
మీరు, రాహుల్‌గాంధీ ప్రచారం కోసం వెళ్లే హెలికాప్టర్లకు, సభలకు ముఖేషే నిధులిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అవి నిజమేనా?