
మాట్లాడితే తట్టుకోలేరు: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు చేయకుండా విభజనను ఎలా ఆపుతారో ప్రజలకు చెప్పాలని సీమాంధ్ర ఎంపీలను ఉద్యోగుల సమైక్య జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామాలు చేయకుండా, అది చేస్తాం, ఇది చేస్తామని ఢిల్లీలో, హైదరాబాద్‌లో మీడియాకు చెబితే లాభం లేదు. ప్రజలకు చెప్పండి. మీరు చెప్పేది ప్రజలు నమ్మితే అందరూ ఉద్యమంలో పాల్గొనవచ్చు’ అని సూచించారు. ఎంపీల మాటలను ప్రజలు విశ్వసిస్తే వారిపై దాడులు కూడా ఉండవన్నారు. ‘‘7 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నా ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించిన సంఘటనలే జరగలేదు. మేం క్రమశిక్షణ గీత దాటి మాట్లాడటం మొదలుపెడితే రాజకీయ నేతలు తట్టుకోలేరు’’ అని హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరుగుతోందని, ఏ పార్టీనీ భుజానికి ఎత్తుకోలేదని చెప్పారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు నెల బోనస్ ఇస్తామన్న వైఎస్సార్‌సీపీ ప్రకటనను ప్రస్తావించగా, ‘సహృదయంతో అవకాశమిచ్చారు. కానీ తీసుకోవడానికి మేం సిద్ధంగా లేము’ అని బదులిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించడానికి హైదరాబాద్‌లో త్వరలో ‘సోరద సద్భావన సదస్సు’ పేరిట సభ నిర్వహించే యోచన ఉందన్నారు. కాగా, పౌర సరఫరాలకు అంతరాయం కలుగుతోంది కాబట్టి విధుల్లోకి రండంటూ రెవె న్యూ సిబ్బందిపై పలు జిల్లాల్లో కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేత బి.వెంకటేశ్వర్లు అన్నారు.ప్రజల మద్దతుతో సమ్మెలో ఉన్న ఉద్యోగులను విధుల్లోకి రావాలంటూ ఒత్తిడి చేయొద్దన్నారు.
25న ఢిల్లీకి సమైక్యాంధ్ర ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక సమ్మె చేపడుతున్న సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. దీని కోసం ఈనెల 25న ఢిల్లీ బయలుదేరనున్నారు. అక్కడ మూడు రోజులపాటు రాష్ట్ర విభజన, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కీలక నేతలను, జాతీయ నాయకులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరాలని సమైక్యాంధ్ర ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఢిల్లీలో నిరసనల్లో పాల్గొని సమైక్యాంధ్ర ఉద్యమ సత్తాను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిసొచ్చేలా చేయాలని సచివాలయ సమైక్యాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కార్యదర్శి కె. వి. కృష్ణయ్య పిలుపునిచ్చారు.