ఫలితాల ప్రభావం విభజనపై ఉండదు:దిగ్విజయ్
సొంత ఎంపీలే అవిశ్వాసం పెట్టడం బాధాకరం
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఫ్రభావం రాష్ట్ర విభజనపై ఉండబోదని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం బాధాకరమని వ్యాఖ్యానిం చారు. రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఈనెల 12న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని వెల్లడించారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత పార్టీ ఎంపీలే యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడంపై ప్రశ్నించగా... ‘‘ఇది చాలా బాధాకరం. అవిశ్వాస తీర్మానం పెట్టడం ఆమోదయోగ్యం కాదు.
వారిలో కొందరితో నేను మాట్లాడా. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాను’’ అని అన్నారు. సోనియాను ఉద్దేశించి మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘ఆయన చాలా సీనియర్, అనుభవ జ్ఞుడైన కాంగ్రెస్ నేత. ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదు. దీనిపై ఆయన వివరణ కోరతా’’ అని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ, హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుపట్టడంపై అడగ్గా.. ‘‘ఆయన సమైక్యాంధ్ర కోసం డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఆయన చెప్పదలుచుకున్నది చెబుతున్నారు. అయితే సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. దానికి అంతా కట్టుబడి ఉండాలి’’ అని స్పష్టంచేశారు. కాగా, దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి డీకే అరుణ సమావేశమయ్యారు. సుమారు పది నిమిషాల పాటు జరిగిన చ ర్చలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడినట్లు తెలిసింది.