నీకు నచ్చింది చేసుకో: సీఎం వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందన
బెల్గాం (కర్ణాటక): ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును కేంద్రం యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో సీఎం కిరణ్‌కు ఏది మంచిదనిపిస్తే అలా ముందుకెళ్లవచ్చంటూ చురకలంటించారు. ఆదివారం కర్ణాటకలోని బెల్గాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీసుకున్న వైఖరికి పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాగా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అందుకు ఆధారాలు చూపాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు.