తమిళనాడులో దాడి, ఖండించిన కేరళ సీఎం
మద్రాస్–ఐఐటీలో బీఫ్ విందు ఇచ్చిన విద్యార్థిపై దాడి
తిరువొత్తియూరు (చెన్నై): మద్రాస్–ఐఐటీలో బీఫ్ విందు ఏర్పాటు చేసిన విద్యార్థిపై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 80 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి బీఫ్ బిరియాని తిన్నారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి సూరజ్ ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఐఐటీలోని మరో వర్గం అతనిపై సోమవారం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సూరజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని మద్రాస్–ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. సూరజ్‌పై దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఖండించారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.