మైసూర్: రాజవంశానికి చెందిన ప్రతిష్టాత్మక అంబా ప్యాలెస్‌లో మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా కుమారి వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న 24 ఏళ్ల యదువీర 22 ఏళ్ల త్రిషికా కుమారిని హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లాడారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పుర్ రాజవంశానికి చెందిన హర్షవర్థన్ సింగ్, మహేశ్రీకుమారి కూతురు త్రిషికా కుమారి. రాచరిక వైభవాన్ని తలపిస్తూ.. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలో సంప్రదాయ రాజరిక దుస్తులు, తలపాగా ధరించిన వరుడు యుదవీర వధువు త్రిషికా పరస్పరం దండలు మార్చుకున్నారు.
సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకలు
మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా కుమారి సింగ్‌ల వివాహ వేడుకలు గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సమవర్దన హోమం తదితర సంప్రదాయ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం వరుడికి తైలస్నానం చేయించి వాణివిలాస దేవుడి గృహంలోని ఆత్మవిలాస, గణపతి దర్శనం అనంత రం యదువీర్ సరవస్వతీ, రాజవంశస్థులు కులదేవల చాముండేశ్వరి దేవీలకు పూజలు నిర్వహించారు. చాముండి బెట్ట దేవస్థానం,శృంగేరి, మేలుకోటె,ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, మహదేశ్వరబెట్ట తదితర ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి మైసూరు ప్యాలెస్‌కు చేరుకున్న తీర్థప్రసాదాలను వరుడు యదువీర్ భక్తి శ్రద్ధలతో స్వీకరించారు.
రాజమాత ప్రమోదాదేవి పర్యవేక్షణలో జయంతి బళ్లాల్ డిజైన్ చేసిన వివిధ రకాల వస్త్రాలను యువరాజు యదువీర్ ధరించారు. అనంతరం యదువీర్ తండ్రి శ్రీకంఠదత్త చామరాజ ఒడయార్ భావచిత్రానికి పూజ నిర్వహించిన అనంతరం ప్యాలెస్ గురవుల సూచన మేరకు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌కు పాదపూజ చేశారు. అనంతరం వరుడు కాశీ యాత్రలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నగరానికి చేరుకున్న దుంగాపుర రాజకుమారి త్రిషికా సింగ్ కుమారి, ఆమె కుటుంబ సభ్యులు ప్యాలెస్‌కు చేరు కొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్యాలెస్ సంప్రదాయాల ప్రకారం ఇరు రాజవంశాల బంధువర్గాల సమక్షంలో ఇరు రాజవంశస్థులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభ రణాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ వివాహ కార్యక్రమాలకు మేవాడ, జైపుర,జోధ్‌పుర, రాజపుత్, భరతపుర, గ్వాలియర్, కిసన్‌నగర, ఖల్విపుర, ఛత్తరపుర, రామాపుర,రఘోఫర్, సింధ్యా రాజవంశాలకు చెందిన వారిని ఆహ్వానించారు. మైసూరు రాజవంశస్థులు ఆచారం ప్రకారం వధూవరులను ఏనుగు అంబారిపై ఊరేగించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్యాలెస్‌లో కారులోనే వధూవరులను ఊరేగించనున్నట్లు రాజమాత ప్రమోదాదేవి తెలిపారు. యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా సింగ్ కుమారిల వివాహ మహోత్సవం సందర్భంగా మైసూరు ప్యాలెస్ విద్యుత్ దీపాలతో కాంతిలీనుతుంది.
వైభవంగా మైసూర్ యువరాజు పెళ్లి
Published Mon, Jun 27 2016 5:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
Advertisement
Advertisement