amba vilas palace
-
వైభవంగా మైసూర్ యువరాజు పెళ్లి
-
వైభవంగా మైసూర్ యువరాజు పెళ్లి
మైసూర్: రాజవంశానికి చెందిన ప్రతిష్టాత్మక అంబా ప్యాలెస్‌లో మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా కుమారి వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న 24 ఏళ్ల యదువీర 22 ఏళ్ల త్రిషికా కుమారిని హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లాడారు. రాజస్థాన్‌లోని దుంగార్పుర్ రాజవంశానికి చెందిన హర్షవర్థన్ సింగ్, మహేశ్రీకుమారి కూతురు త్రిషికా కుమారి. రాచరిక వైభవాన్ని తలపిస్తూ.. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలో సంప్రదాయ రాజరిక దుస్తులు, తలపాగా ధరించిన వరుడు యుదవీర వధువు త్రిషికా పరస్పరం దండలు మార్చుకున్నారు. సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకలు మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా కుమారి సింగ్‌ల వివాహ వేడుకలు గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సమవర్దన హోమం తదితర సంప్రదాయ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం వరుడికి తైలస్నానం చేయించి వాణివిలాస దేవుడి గృహంలోని ఆత్మవిలాస, గణపతి దర్శనం అనంత రం యదువీర్ సరవస్వతీ, రాజవంశస్థులు కులదేవల చాముండేశ్వరి దేవీలకు పూజలు నిర్వహించారు. చాముండి బెట్ట దేవస్థానం,శృంగేరి, మేలుకోటె,ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, మహదేశ్వరబెట్ట తదితర ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి మైసూరు ప్యాలెస్‌కు చేరుకున్న తీర్థప్రసాదాలను వరుడు యదువీర్ భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. రాజమాత ప్రమోదాదేవి పర్యవేక్షణలో జయంతి బళ్లాల్ డిజైన్ చేసిన వివిధ రకాల వస్త్రాలను యువరాజు యదువీర్ ధరించారు. అనంతరం యదువీర్ తండ్రి శ్రీకంఠదత్త చామరాజ ఒడయార్ భావచిత్రానికి పూజ నిర్వహించిన అనంతరం ప్యాలెస్ గురవుల సూచన మేరకు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌కు పాదపూజ చేశారు. అనంతరం వరుడు కాశీ యాత్రలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నగరానికి చేరుకున్న దుంగాపుర రాజకుమారి త్రిషికా సింగ్ కుమారి, ఆమె కుటుంబ సభ్యులు ప్యాలెస్‌కు చేరు కొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్యాలెస్ సంప్రదాయాల ప్రకారం ఇరు రాజవంశాల బంధువర్గాల సమక్షంలో ఇరు రాజవంశస్థులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభ రణాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ వివాహ కార్యక్రమాలకు మేవాడ, జైపుర,జోధ్‌పుర, రాజపుత్, భరతపుర, గ్వాలియర్, కిసన్నగర, ఖల్విపుర, ఛత్తరపుర, రామాపుర,రఘోఫర్, సింధ్యా రాజవంశాలకు చెందిన వారిని ఆహ్వానించారు. మైసూరు రాజవంశస్థులు ఆచారం ప్రకారం వధూవరులను ఏనుగు అంబారిపై ఊరేగించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్యాలెస్‌లో కారులోనే వధూవరులను ఊరేగించనున్నట్లు రాజమాత ప్రమోదాదేవి తెలిపారు. యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్, త్రిషికా సింగ్ కుమారిల వివాహ మహోత్సవం సందర్భంగా మైసూరు ప్యాలెస్ విద్యుత్ దీపాలతో కాంతిలీనుతుంది. -
వైభవంగా మైసూర్ యువరాజు వివాహం
మైసూర్: మైసూర్ యువరాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌కు రాజస్థాన్‌లోని దుంగర్పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. అతిరథ మహారథులు, ఆత్మీయుల మధ్య ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు. ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో అతిథులకు మరో విందు ఇవ్వనున్నారు. -
ప్యాలెస్‌లో పెళ్లి సందడి
మైసూరు రాజుల ఇంట ‘పెళ్లిబాజా’.... పెళ్లిపీటలు ఎక్కనున్న యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ ప్రారంభమైన యువరాజు వివాహ కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణలతో సిద్ధమవుతున్న మైసూరు ప్యాలెస్ మైసూరు: మైసూరు రాజవంశీయుల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ని, మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహమాడనున్నారు. రాజవంశంలో 40 సంవత్సరాల అనంతరం జరుగుతున్న వివాహం కావడంతో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగి నిర్వహించేందుకు రాజవంశీయులు సన్నాహాలు చేస్తున్నారు. మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహ మహోత్సవ పనులు శుక్రవారం నుంచి లాంఛనంగా ప్రారంభమవనున్నాయి. వివాహ ఏర్పాట్లను రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాహ మహోత్సవ వేడుకల ప్రారంభం...... ఈనెల 24న(శుక్రవారం) ధార్మిక విధివిధానాలు, హోమ కార్యక్రమాలతో వివాహ మహోత్సవ వేడుకలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. జూన్25న ప్యాలెస్ ముందుభాగంలో పెళ్లి మంటపం, వరుడుకి మంగళ స్నాన కార్యక్రమాలు, అనంతరం వరుడికి కల్యాణ కంకణం కట్టి ప్యాలెస్‌లోని కల్యాణ మంటపంలో హోమాలు నిర్వహించనున్నారు. జూన్ 26న మైసూరులోని చాముండి బెట్టపై కొలువైన చాముండేశ్వరీ దేవి ఆలయంతో పాటు మేలుకోటె, ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, శృంగేరి, మహదేశ్వరబెట్ట ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి తీర్థప్రసాదాలు ప్యాలెస్‌కు చేరుకుంటాయి. వాటిని వరుడు స్వీకరించి మూడవ రోజు ధారా ముహూర్తానికి సిద్ధమవుతారు. జూన్27న ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30గంటల వరకు కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరుగనుంది. అదేరోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు. ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే వివాహ కార్యక్రమాలలో యదువీర్ ధరించే లాంగ్కోటులను స్వతహాగా ఫ్యాషన్ డిజైనరైన రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ పర్యవేక్షణలో డిజైన్ చేస్తుండడం విశేషం. వివాహానికి అతిరథ మహారథులు మైసూరు రాజకుటుంబంలో జరగనున్న ఈ వివాహానికి ఇరు రాజవంశీయులతో పాటు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖలు హాజరు కానున్నట్లు సమాచారం. వివాహానికి సుమారు 2,000 మంది అతిథులు పాల్గొనే అవకాశముంది. ఇంకా చాలా మందిని పిలవాల్సి ఉన్నా ప్యాలెస్‌లో స్థలాభావం కారణంగా అతిథుల సంఖ్యను రెండు వేలకు పరిమితం చేసినట్లు సమాచారం. కాగా, వివాహానికి హాజరైన ప్రముఖులకు ప్రత్యేక భోజన వసతిని కల్పించనున్నారు. దక్షిణాది సాంప్రదాయ వంటకాలతో కూడిన మెనును వివాహ కార్యక్రమం కోసం రూపొందించినట్లు సమాచారం. -
వారసుడెక్కడ ?
రాజు వెడలె రవితేజములలరగ... అని మైసూరు మాజీ సంస్థానాధీశుల ఇంట పాడుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టేట్లుంది. మైసూరు రాజుల చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ గత ఏడాది డిసెంబరు 10న పరమపదించగా, ఆయన వారసుని ఎంపికలో రాణి ప్రమోదా దేవి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ దంపతులకు సంతానం లేని సంగతి తెలిసిందే. కనుక వారసుని అన్వేషణ అనివార్యమైంది. దగ్గర పడుతున్న దసరా మైసూరు రాజ వంశీకులకు సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 1399లో యదురాయ పట్టాభిషేకంతో మైసూరు రాజుల శకం ప్రారంభమైంది. సుమారు 400 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలతో మైసూరు పేరు ప్రఖ్యాతులు అన్ని ఖండాలకు వ్యాపించింది. దసరా సందర్భంగా మైసూరు రాజులు అంబా విలాస్ రాజ ప్రాసాదంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ప్రైవేట్ దర్బారు, ఆయుధ పూజ, విజయ దశమి ఊరేగింపులలో అప్పటి మైసూరు రాచరికం కళ్లకు సాక్షాత్కరిస్తుంది. శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ మరణానంతరం, ఆయన వారసునిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. సెప్టెంబరు 25న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఉత్సవాలపై అనుమానాలు మరో మూడు నెలల్లో వారసుని ప్రకటించాల్సి ఉంది. అయితే రాజప్రాసాదం వర్గాల ప్రకారం ఈ సారి నవరాత్రి ఉత్సవాలు ప్యాలెస్‌లో జరిగే అవకాశాల్లేవు. శ్రీకంఠదత్త సంవత్సరీకం (డిసెంబరు 10) పూర్తయ్యే వరకు రాజ ప్రాసాదంలో పూజలు, పునస్కారాలు ఉండవు. అయితే వారసుని ఎంపికలో జరుగుతున్న జాప్యం పట్ల పర్యాటక రంగంలోని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దసరా సందర్భంగా అలనాటి రాజ వైభవాన్ని తిలకించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోవచ్చని వారు భయపడుతున్నారు. తద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కనుక రాణి ప్రమోదా దేవి ఈ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. రాణి ప్రమోదా దేవికి పెను సవాలు మైసూరు రాజ వంశీకుల వారసునికి ప్రత్యేక లక్షణాలుండాలి. వారసునికి ఎలాంటి అర్హతలుండాలో శతాబ్దాల కిందటే నిర్ధారించారు. అలాంటి అర్హత కలిగిన వ్యక్తులు అందుబాటులో లేనందు వల్లే వారసుని ఎంపికలో అసాధారణ జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. వారసునికి రాజ వంశీకులతో రక్త సంబంధం ఉండాలి. అతనికి మైసూరు రాచరిక సంప్రదాయాలు తెలిసి ఉండాలి. ఉత్తమ విద్యార్హతలు కలిగి ఉండాలి. స్వచ్ఛమైన జీవన శైలితో పాటు అవివాహితుడుగా ఉండాలి. శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్‌కు అయిదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. వారికంతా మగ సంతానమే. వారిలో ఒకరిని వారసునిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే క్లిష్ట సమస్య ఎదురవుతోంది. ఆ అయిదుగురిలోని ఉపనన్యు, రుద్ర ప్రతాప్ సింగ్‌లు కేవలం పదో తరగతి వరకే చదివారు. వర్చస్ అరస్, ఆదిత్య గురుదేవ్లు డిగ్రీ పూర్తి చేశారు. వర్చస్ అరస్‌కు రాజ ప్రాసాదం సంప్రదాయాలు, శ్లోకాలు తెలిసినప్పటికీ, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా మరో సామాజిక వర్గానికి చెందిన, విడాకులు పొందిన మహిళను పెళ్లాడారు. ఆదిత్య ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేసి, బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక మిగిలింది కాంతరాజ్ అరస్. ఇతనిని ఎంపిక చేయడానికి ప్రమోదా దేవి సముఖంగా ఉన్నప్పటికీ, ఒడయార్ బతికి ఉన్నప్పుడే అతనిని వ్యతిరేకించారు. పైగా అతను పీయూసీ వరకే చదువుకున్నాడు. ఒడయార్‌కు శ్రాద్ధ కర్మలు ఇతనే నిర్వర్తించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వారసుని ఎంపిక రాణి ప్రమోదా దేవికి క్లిష్టతరంగా తయారైంది.