ప్యాలెస్లో పెళ్లి సందడి | Royal Wedding: Mysuru Wadiyar heir to marry a Rajasthani royal | Sakshi
Sakshi News home page

ప్యాలెస్లో పెళ్లి సందడి

Published Sat, Jun 25 2016 3:00 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ప్యాలెస్లో పెళ్లి సందడి

ప్యాలెస్లో పెళ్లి సందడి

  • మైసూరు రాజుల ఇంట ‘పెళ్లిబాజా’....
  • పెళ్లిపీటలు ఎక్కనున్న యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్
  • ప్రారంభమైన యువరాజు వివాహ కార్యక్రమాలు
  • ప్రత్యేక అలంకరణలతో సిద్ధమవుతున్న మైసూరు ప్యాలెస్
  •  
    మైసూరు: మైసూరు రాజవంశీయుల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ని, మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహమాడనున్నారు.

    రాజవంశంలో 40 సంవత్సరాల అనంతరం జరుగుతున్న వివాహం కావడంతో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగి నిర్వహించేందుకు రాజవంశీయులు సన్నాహాలు చేస్తున్నారు. మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహ మహోత్సవ పనులు శుక్రవారం నుంచి లాంఛనంగా  ప్రారంభమవనున్నాయి. వివాహ ఏర్పాట్లను రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
     
     వివాహ మహోత్సవ వేడుకల ప్రారంభం......
    ఈనెల 24న(శుక్రవారం) ధార్మిక విధివిధానాలు, హోమ కార్యక్రమాలతో వివాహ మహోత్సవ వేడుకలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. జూన్25న ప్యాలెస్ ముందుభాగంలో పెళ్లి మంటపం, వరుడుకి మంగళ స్నాన కార్యక్రమాలు, అనంతరం వరుడికి కల్యాణ కంకణం కట్టి ప్యాలెస్‌లోని కల్యాణ మంటపంలో హోమాలు నిర్వహించనున్నారు.

    జూన్ 26న మైసూరులోని చాముండి బెట్టపై కొలువైన చాముండేశ్వరీ దేవి ఆలయంతో పాటు మేలుకోటె, ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, శృంగేరి, మహదేశ్వరబెట్ట ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి తీర్థప్రసాదాలు ప్యాలెస్‌కు చేరుకుంటాయి.  
     
    వాటిని వరుడు స్వీకరించి మూడవ రోజు ధారా ముహూర్తానికి సిద్ధమవుతారు. జూన్27న ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30గంటల వరకు కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో  యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరుగనుంది. అదేరోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో  రెండవ సారి తాళి కట్టనున్నారు.
     
    ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

    అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే వివాహ కార్యక్రమాలలో యదువీర్ ధరించే లాంగ్‌కోటులను స్వతహాగా ఫ్యాషన్ డిజైనరైన రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ పర్యవేక్షణలో డిజైన్ చేస్తుండడం విశేషం.
     
    వివాహానికి అతిరథ మహారథులు
    మైసూరు రాజకుటుంబంలో జరగనున్న ఈ వివాహానికి ఇరు రాజవంశీయులతో పాటు అతిరథ మహారథులు హాజరుకానున్నారు.   రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖలు హాజరు కానున్నట్లు సమాచారం.

    వివాహానికి సుమారు 2,000 మంది అతిథులు పాల్గొనే అవకాశముంది. ఇంకా చాలా మందిని పిలవాల్సి ఉన్నా ప్యాలెస్‌లో స్థలాభావం కారణంగా అతిథుల సంఖ్యను రెండు వేలకు పరిమితం చేసినట్లు సమాచారం. కాగా, వివాహానికి హాజరైన ప్రముఖులకు ప్రత్యేక భోజన వసతిని కల్పించనున్నారు. దక్షిణాది సాంప్రదాయ వంటకాలతో కూడిన మెనును వివాహ కార్యక్రమం కోసం రూపొందించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement