Yaduveer krishnadatta chamaraja wadiyar
-
రాజదర్బారులో దసరాకు ఎంతపని చేశారు!?
దేశంలోనై మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరం.. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొదటి ర్యాంకు ఈ నగరానికి వచ్చింది. ఇక్కడి మైసూర్ రాజభవనంలో జరిగే దసరా వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. కానీ ఈసారి ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలు మాత్రం మరో చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి. నగర వాసులకు పరిశ్రుభత మీద పెద్దగా శ్రద్ధలేదనే విషయాన్ని చాటాయి. ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించి మైసూర్ రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోను పెట్టారు. దర్బార్ హాల్లో దసరా వేడుకలు ముగిసిన తర్వాత.. ఎంత దారుణంగా పరిసరాలు మారిపోయాయో ఈ ఫొటో చాటుతున్నది. దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, టీ కప్పులు యథేచ్ఛగా విసిరేసి వెళ్లిపోయారు. దీంతో రాజదర్బార్ చెత్తకుండీలా మారిపోయింది. "అత్యంత పరిశుభ్రమైన నగరం అన్న కీర్తిని మనం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. పరిశుభ్రతకు మారుపేరైన మన నగరంలో పరిస్థితి ఇలా ఉంది. రాజ దర్బారు అనేది థియేటర్ కాదు.. అక్కడ తినకూడదు.. థియేటర్ మాదిరిగా అక్కడ చెత్త వేయకూడదన్న విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది. (థియేటర్లో కూడా ఇలా చుట్టూ చెత్త వేసుకోకూడదు). మన సంప్రదాయ పండుగ, మన గొప్ప నగరం ప్రత్యేకతలను నిలబెట్టుకుందాం. పవిత్రమైన భవనాన్ని ఇలా కించపరచడం ఇకముందు జరగకుండా చూసుకుందాం' అని పేర్కొంటూ.. చెత్తచెదారంతో మురికిగా మారిన రాజదర్బార్ ఫొటోను ఆయన పోస్టుచేశారు. -
వైభవంగా మైసూర్ యువరాజు వివాహం
మైసూర్: మైసూర్ యువరాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌కు రాజస్థాన్‌లోని దుంగర్పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. అతిరథ మహారథులు, ఆత్మీయుల మధ్య ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు. ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో అతిథులకు మరో విందు ఇవ్వనున్నారు. -
ప్యాలెస్‌లో పెళ్లి సందడి
మైసూరు రాజుల ఇంట ‘పెళ్లిబాజా’.... పెళ్లిపీటలు ఎక్కనున్న యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ ప్రారంభమైన యువరాజు వివాహ కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణలతో సిద్ధమవుతున్న మైసూరు ప్యాలెస్ మైసూరు: మైసూరు రాజవంశీయుల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ని, మైసూరు యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహమాడనున్నారు. రాజవంశంలో 40 సంవత్సరాల అనంతరం జరుగుతున్న వివాహం కావడంతో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగి నిర్వహించేందుకు రాజవంశీయులు సన్నాహాలు చేస్తున్నారు. మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ వివాహ మహోత్సవ పనులు శుక్రవారం నుంచి లాంఛనంగా ప్రారంభమవనున్నాయి. వివాహ ఏర్పాట్లను రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివాహ మహోత్సవ వేడుకల ప్రారంభం...... ఈనెల 24న(శుక్రవారం) ధార్మిక విధివిధానాలు, హోమ కార్యక్రమాలతో వివాహ మహోత్సవ వేడుకలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. జూన్25న ప్యాలెస్ ముందుభాగంలో పెళ్లి మంటపం, వరుడుకి మంగళ స్నాన కార్యక్రమాలు, అనంతరం వరుడికి కల్యాణ కంకణం కట్టి ప్యాలెస్‌లోని కల్యాణ మంటపంలో హోమాలు నిర్వహించనున్నారు. జూన్ 26న మైసూరులోని చాముండి బెట్టపై కొలువైన చాముండేశ్వరీ దేవి ఆలయంతో పాటు మేలుకోటె, ఉత్తనహళ్లి, నంజనగూడు, శ్రీరంగపట్టణ, శృంగేరి, మహదేశ్వరబెట్ట ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి తీర్థప్రసాదాలు ప్యాలెస్‌కు చేరుకుంటాయి. వాటిని వరుడు స్వీకరించి మూడవ రోజు ధారా ముహూర్తానికి సిద్ధమవుతారు. జూన్27న ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30గంటల వరకు కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరుగనుంది. అదేరోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు. ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో మరో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే వివాహ కార్యక్రమాలలో యదువీర్ ధరించే లాంగ్కోటులను స్వతహాగా ఫ్యాషన్ డిజైనరైన రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ పర్యవేక్షణలో డిజైన్ చేస్తుండడం విశేషం. వివాహానికి అతిరథ మహారథులు మైసూరు రాజకుటుంబంలో జరగనున్న ఈ వివాహానికి ఇరు రాజవంశీయులతో పాటు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖలు హాజరు కానున్నట్లు సమాచారం. వివాహానికి సుమారు 2,000 మంది అతిథులు పాల్గొనే అవకాశముంది. ఇంకా చాలా మందిని పిలవాల్సి ఉన్నా ప్యాలెస్‌లో స్థలాభావం కారణంగా అతిథుల సంఖ్యను రెండు వేలకు పరిమితం చేసినట్లు సమాచారం. కాగా, వివాహానికి హాజరైన ప్రముఖులకు ప్రత్యేక భోజన వసతిని కల్పించనున్నారు. దక్షిణాది సాంప్రదాయ వంటకాలతో కూడిన మెనును వివాహ కార్యక్రమం కోసం రూపొందించినట్లు సమాచారం. -
యువరాజు వివాహానికి ప్రముఖలకు ఆహ్వానం
మైసూరు: మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్, త్రిషికా కుమారిల వివాహానికి సంబంధించి వివాహ ఆహ్వాన పత్రికలను అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైసూరు రాజవంశస్థుల సంప్రదాయం ప్రకారం గండభేరుండం, ప్యాలెస్ చిహ్నలతో కూడిన ఆహ్వాన పత్రికలను ముద్రించారు. మొత్తం ఐదు రకాల ఆహ్వాన పత్రికల ముద్రణకు ఆమోదం తెలిపిన రాజమాత ప్రమోదా దేవి ఒడయార్ గత వారం శృంగేరి మఠానికి చేరుకొని మఠం పీఠాధిపతి, రాజగురవు శ్రీ భారతీతీర్థ స్వాముల ఆశీర్వాదం పొందిన అనంతరం లగ్న పత్రికకు పూజలు చేయించారు. ఇప్పటికే బీజేపీ పార్టీలో గుర్తింపు యదువీర్ ఒడయార్‌కు కాబోయే మామ హర్షవర్థన్(త్రిషికా కుమారి తండ్రి) బంగారు లేపనంతో చేయించిన ఆహ్వాన పత్రికను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే అందజేశారు. కేంద్ర మంత్రివర్గంలోని ప్రముఖులకు,ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే,మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ తదితర రాష్ట్ర ప్రముఖ రాజకీయ,సినీ,క్రీడాకారులకు ఆహ్వాన పత్రికలను అందచేసారు. -
పిల్లలకు పాఠాలు బోధించిన యువరాజు
మైసూరు: మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ శుక్రవారం పిల్లలు పాఠాలు బోధించారు. నగరంలోని పడువారహళ్లిలోని వినాయకనగర్లోనున్న ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఆయన ఏడవ తరగతి పిల్లలకు దసరా విశేషాలు, మైసూరు నగర చరిత్ర, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై గంటపాటు పాఠాలు చెప్పారు. అనంతరం ప్రశ్నలు అడిగారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి, పిల్లలను ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించడానికి కలిసు ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని యదువీర కృష్ణదత్త ఒడయార్ తెలిపారు. ప్యాలెస్‌లో ఫోటోషూట్‌పై స్పందిస్తూ ప్యాలెస్‌లో నిగూఢ శక్తి ప్రత్యేక ఆకర్షణ ఉందన్నారు. ఇంత వరకు ఆయా ప్రదేశాల్లో తమ వంశానికి చెందిన వారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలు ఒడిగడితే వారికి శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. -
జూన్ 22 నుంచి నో ఎంట్రీ
మైసూరు : మైసూరు యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహం సందర్భంగా జూన్ 22 నుంచి 28వరకు మైసూరు ప్యాలెస్‌లో సామాన్యులకు ప్రవేశాన్ని నిషేధించారు. ఈ మేరకు ప్యాలెస్ పాలక మండలి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 27న రాజస్థాన్‌కు చెందిన త్రిషికా కుమారితో మైసూరు యువరాజుకు వివాహం జరగనుంది. అందులో భాగంగా 22 నుంచే ప్యాలెస్‌లో వేడుకలు మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ప్రవేశం నిషేధించాల్సిందిగా రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ సూచించడంతో పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
రాజకీయాలపై ఆసక్తి లేదు
మండ్య: ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీలో చేర ట్లేదని ఏ రాజకీయ పార్టీ నుంచి తనకు ఆహ్వాన పత్రిక అందలేదని మైసూరు యువరాజు యధువీర్ శ్రీకంఠదత్త ఒడయార్ తెలిపారు. నగరంలోని అభినవ భారతి పీయూ కాలేజీలో నూతనంగా నిర్మించిన భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తండ్రి శ్రీకంఠదత్త ఒడయార్ రాజకీయ అనుభవంతో నాలుగు సార్లు మైసూరు ఎంపీగా పనిచేసారన్నారు. తనకు, ప్రజలకు మధ్య సంబంధాలు ఇంకా మెరుడుపడాల్సి ఉందని, తానింకా చాలా నేర్చుకోవాలి ఉందన్నారు. -
కమలదళంలోకి యువరాజు...
సాక్షి, బెంగళూరు/మైసూరు: మైసూరు యదువంశ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ భారతీయ జనతా పార్టీలోకి చేరనున్నారా? అంటే రాష్ట్ర బీజేపీ నాయకులు అవుననే అంటున్నారు. యువరాజు కమలదలంలోకి చేరడానికి ప్రధాని నరేంద్రమోదీ సైతం అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మైసూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన నరేంద్రమోదీ స్థానిక లలిత్‌మహల్ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయమే రాజమాత ప్రమోదా దేవి తమ దత్త కుమారుడు యదువీర్‌తో కలిసి ప్రధాని న రేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో యదువీర్ తాను బీజేపీలోకి చేరి దేశానికి సేవ చేయాలనిభావిస్తున్నట్లు మోదీతో పేర్కొన్నారు. ఇందుకు నరేంద్రమోదీ తన సమ్మతిని తెలియజేశారు. ఇదిలా ఉండగా గతంతో యదువీర్ తాను త్వరలోకి రాజకీయాల్లోకి రానున్నట్లు బహిరంగంగానే పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఆ యువకుడు మోదీ అభిమానే... ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను అడ్డగించిన యువకుడు మైసూరు తాలూకాలోని వరకూడు గ్రామానికి చెందిన వినయ్ అని తెలిసింది. దేశ శ్రేయస్సు కోసం తాను రూపొందించిన ఓ ప్రాజెక్టును మోదీకి వివ రించడానికే కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లినట్లు పోలీసు విచారణలో ఇప్పటి వరకూ తేలింది. వివరాలు... మైసూరులో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమాలను ముగించుకుని స్థానిక హోటల్‌కు వెలుతున్న మోదీ కాన్వాయ్‌కు ఓ యువకుడు అడ్డుగా వెళ్లిన విషయం తెలిసిందే. వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు వినయ్ తెలిపిన వివరాలను అనుసరించి... మైసూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిప్లొమో చదువతున్న వినయ్ స్వతహాగా నరేంద్రమోదీ అభిమాని. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఆకర్షితుడై తాను కూడా దేశ శ్రేయస్సుకోసం ఏమైనా చేయాలని నిత్యం తల్లిదండ్రులతో చెప్పేవారు. ఈ క్రమంలోనే దేశంలో పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో ‘గ్రీన్ ఇండియా’ పేరుతో ఓ ప్రాజెక్టును రూపొందించారు. సదరు ప్రాజెక్టు గురించి వివరించడానికి ప్రధానిని కలవాలనుకున్నా వీలు పడలేదు. దీంతో వినయ్ మోదీ కాన్వాయ్ృు అడ్డుగా వెళ్లి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కలిగిన బ్యాగ్‌ను మోదీ ప్రయాణిస్తున్న కారు పైకి విసిరాడు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రధాని కాన్వాయ్‌కు అడ్డుతగిలిన వినయ్‌ను పోలీసుల విచారణ చేస్తున్నారు.