రాజదర్బారులో దసరాకు ఎంతపని చేశారు!?
దేశంలోనై మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరం.. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొదటి ర్యాంకు ఈ నగరానికి వచ్చింది. ఇక్కడి మైసూర్ రాజభవనంలో జరిగే దసరా వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. కానీ ఈసారి ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలు మాత్రం మరో చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి. నగర వాసులకు పరిశ్రుభత మీద పెద్దగా శ్రద్ధలేదనే విషయాన్ని చాటాయి.
ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించి మైసూర్ రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోను పెట్టారు. దర్బార్ హాల్‌లో దసరా వేడుకలు ముగిసిన తర్వాత.. ఎంత దారుణంగా పరిసరాలు మారిపోయాయో ఈ ఫొటో చాటుతున్నది. దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, టీ కప్పులు యథేచ్ఛగా విసిరేసి వెళ్లిపోయారు. దీంతో రాజదర్బార్ చెత్తకుండీలా మారిపోయింది.
"అత్యంత పరిశుభ్రమైన నగరం అన్న కీర్తిని మనం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. పరిశుభ్రతకు మారుపేరైన మన నగరంలో పరిస్థితి ఇలా ఉంది. రాజ దర్బారు అనేది థియేటర్ కాదు.. అక్కడ తినకూడదు.. థియేటర్ మాదిరిగా అక్కడ చెత్త వేయకూడదన్న విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది. (థియేటర్‌లో కూడా ఇలా చుట్టూ చెత్త వేసుకోకూడదు). మన సంప్రదాయ పండుగ, మన గొప్ప నగరం ప్రత్యేకతలను నిలబెట్టుకుందాం. పవిత్రమైన భవనాన్ని ఇలా కించపరచడం ఇకముందు జరగకుండా చూసుకుందాం' అని పేర్కొంటూ.. చెత్తచెదారంతో మురికిగా మారిన రాజదర్బార్ ఫొటోను ఆయన పోస్టుచేశారు.