వైభవంగా మైసూర్ యువరాజు వివాహం
మైసూర్: మైసూర్ యువరాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌కు రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. అతిరథ మహారథులు, ఆత్మీయుల మధ్య ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్‌ల వివాహం జరిగింది.
ఈ రోజు సాయంత్రం ఉరుతనె ఉయ్యాల, నాగవల్లి శాస్త్రాలు జరుగనున్నాయి. ఒడయార్ వంశస్థుల ఆచారం ప్రకారం వధువుకు వరుడు వివాహ ముహూర్తంలో తాళి కట్టిన అనంతరం సాయంత్రం నిర్వహించే నాగవల్లి శాస్త్రంలో రెండవ సారి తాళి కట్టనున్నారు.
ఇది మైసూరు రాజకుటుంబానికే పరిమితమైన ప్రత్యేక ఆచారం కావడం గమనార్హం. జూన్ 28న ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 29న సామాన్య ప్రజలకు రిసెప్షన్‌తో పాటు నూతన వధూవరులు తమ కారులో ప్రజలకు దర్శనమివ్వడానికి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్‌లో అతిథులకు మరో విందు ఇవ్వనున్నారు.