
పదోన్నతి కోసం 102 రోజులుగా దీక్ష
ఖమ్మం జిల్లా భద్రాచలం బాలసదనంలో అటెండర్‌గా పనిచేస్తున్న ఆర్.శివరామశాస్త్రి పదోన్నతి కల్పించాలని కోరుతూ 102 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు.
చిరుద్యోగిని పట్టించుకోని అధికారులు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం బాలసదనంలో అటెండర్‌గా పనిచేస్తున్న ఆర్.శివరామశాస్త్రి పదోన్నతి కల్పించాలని కోరుతూ 102 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతడిని ‘సాక్షి’ కదిలించగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జిల్లా శిశు సంక్షేమ శాఖలో 1992 నుంచి నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న శివరామశాస్త్రి ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. పదోన్నతి కోసం 1997 నుంచి ఆయన ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తునే ఉన్నారు. శాఖలో సీడీపీవో పోస్టుకు కావాల్సిన అర్హతలున్నా వరంగల్ రీజినల్ అధికారులు సరైన సమయంలో ఎల్‌డీసీగా(1997లోపు) పదోన్నతి కల్పించకపోవడంతో గెజిటెడ్ హోదా పదోన్నతిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు.
శాఖ డెరైక్టర్లు, సెక్రటరీలు, మంత్రులను, గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్రపతికి వినతిపత్రాలు పంపించానని, వారు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినా శిశు, సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో 4 సార్లు డ్యూటీ చేస్తూ నిరాహార దీక్ష చేశానని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.